టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన టెంపర్ సినిమా హిందీలో సింబ పేరిట రీమేక్ అయిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన తెలుగు వెర్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ పోషించగా హిందీలో రణ్వీర్ సింగ్ ఆ పాత్రలో నటించారు. హిందీలో ఫేమస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా 5వ వారంలో ప్రవేశించినప్పటికీ.. కలెక్షన్స్కి మాత్రం డోకా లేదు. విడుదలైన మొదట్లోనే రూ.100 కోట్ల క్లబ్ మార్కుని దాటి.. ఆరు సార్లు రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా రోహిత్ శెట్టికి రికార్డ్ కట్టబెట్టిన ఈ సినిమా ప్రస్తుతం రూ.240 కోట్లు వసూలు చేయడం మరో విశేషం. ప్రముఖ ఫిలిం ఎనలిస్ట్, రివ్యూయర్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్లో సింబ కలెక్షన్స్ లెక్కలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.
కేదార్నాథ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సారా.. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ సరసన జంటగా నటించింది. రోహిత్ శెట్టి కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా చెన్నై ఎక్స్ప్రెస్ కాగా.. తాజాగా సింబ సినిమా ఆ రికార్డుని అధిగమించింది.