'రాహుల్.. 15 నిమిషాలు చేతిలో పేపర్ లేకుండా కాంగ్రెస్ సాధించిన విజయాల గురించి మాట్లాడు' అని రాహుల్కు సవాల్ విసిరారు ప్రధాని నరేంద్ర మోదీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో భాగంగా నేడు మోదీ చామరాజనగరలో పర్యటించారు. అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. తొలుత కన్నడ భాషలో ప్రజలను పలకరించారు. ఇది బీజేపీ గాలి కాదని, బీజేపీ సునామి అని అన్నారు. రాహుల్ పై విమర్శలు గుప్పించారు. రాహుల్ వందేమాతరం గీతాన్ని గౌరవించలేదని పేర్కొన్నారు. వందేమాతరాన్ని అవమానించే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారని ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ ఓ పావు గంట చేతిలో పేపర్ లేకుండా కర్ణాటక కాంగ్రెస్ సాధించిన విజయాల గురించి మాట్లాడాలని సూచించారు. హిందీ, ఇంగ్లీష్ లేదా ఇటాలియన్ ఇలా ఏ భాషలోనైనా మాట్లాడాలని.. తమ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ఏమేమి చేసిందో చెప్పాలని అన్నారు. "ఈ రోజు కార్మిక దినోత్సవం. కానీ రాహుల్ కనీసం దేశ కార్మికులకు గ్రీటింగ్స్ కూడా చెప్పలేదు" అని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం ఏమీ చేయలేదని ప్రధాని మోదీ విమర్శించారు.
తన లక్ష్యం అభివృద్ధే తప్ప రాజకీయాలు కాదని మోదీ అన్నారు. తాము దేశంలోని గ్రామాలన్నింటినీ విద్యుదీకరించి చీకట్లను తరిమేస్తున్నామని.. దేశవ్యాప్తంగా 18 వేల గ్రామాలకు విద్యుత్ అందించామని ఆయన చెప్పారు. ఇక కర్నాటకకు కాబోయే ముఖ్యమంత్రి యడ్యూరప్పే అని ప్రధాని మోదీ తెలిపారు. సిఎం సిద్ధరామయ్య ప్రభుత్వం మాటల ప్రభుత్వమని దుయ్యబట్టారు. వారసత్వంపైనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నమ్మకం ఎక్కువగా ఉందని.. రాహుల్ బీజేపీని విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని మోదీ తెలిపారు.