ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ఈ విషయంలో కేంద్రాన్నే తప్పుపట్టారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఇదే వేదికపై నుంచి అనేక అంశాలపై ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్పందించాల్సిందిగా విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కేసీఆర్.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమే ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని అని ఆరోపించారు.
ఓవైపు కేంద్రం వైఖరి అలా వుంటే, మరోవైపు ఏపీలో స్థానికంగా రాజకీయ పార్టీలు సైతం అదే ధోరణి అలంబిస్తున్నాయి అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాజకీయం అంటే చెప్పిందే చేయాలి. చేసేదే చెప్పాలి. కానీ చెప్పేదొకటి, చేసేది మరొకటి అవడం సరికాదు. అందుకే దేశ రాజకీయాల్లో మార్పు ఎంతో అవసరం అని కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు.. అవసరమైతే దేశ రాజకీయాల్లో పరివర్తన కోసం దేశవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయడానికైనా తాను సిద్ధమేనని అన్నారు.