BJP MLA Harish Poonja allegations on CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పూంజ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్య 24 మంది హిందూ కార్యకర్తలను చంపించారు అని హరీష్ ఆరోపించారు. దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడీ నియోజకవర్గం నుంచి కర్ణాటక అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హరీష్ పూంజ గత వారం జరిగిన ఒక ప్రైవేటు ఫంక్షన్ లో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన హిందూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. 24 మంది హిందూ కార్యకర్తలను చంపించిన సిద్ధరామయ్య కోసం మీరు ఓట్లు అడిగారని.. బజరంగ్ దళ్ సంస్థపై నిషేధం విధిస్తాం అని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేశారు అంటూ హరీశ్ పూంజ ఆవేశంతో ఊగిపోయారు. హరీష్ పూంజ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజేపి ఎమ్మెల్యే హరీష్ పూంజ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. హరీష్ పూంజ వైఖరి చూసిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవేశంతో రగిలిపోతున్నారు. బీజేపి ఎమ్మెల్యే హరీష్ పూంజపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమాయత్తం అవుతున్నారు.
కర్ణాటకలో బీజేపి సైతం ముందు నుంచి సిద్ధరామయ్యపై ఈ విషయంలో తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. 2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో దక్షిణ కన్నడ జిల్లాలో హిందూ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురయ్యారని.. ఆ హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోకుండా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య కాపాడారని బీజేపి ఆరోపిస్తోంది.
ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన బీజేపి 2018 ఎన్నికల్లో కోస్తా కర్ణాటకలో ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంది. మరోవైపు బీజేపి చేస్తోన్న ఆరోపణల తీవ్రంగా పరిగణించిన సిద్ధరామయ్య సైతం.. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు ఏమీ లేదని.. తాము ఏ నిందితులను కాపాడలేదని చెబుతూ వచ్చారు. వ్యక్తిగత కక్షల్లోనే వారు హతం అయ్యారని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే, ఘర్షణల్లో చనిపోయినట్టుగా వార్తల్లోకెక్కిన పరేష్ మెస్త అనే ఒక హిందూ కార్యకర్త హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. అతడు ప్రమాదవశాత్తుగా చనిపోయాడు అని నివేదిక ఇవ్వడం అప్పటి ఎన్నికల్లో బీజేపికి గట్టి ఎదురుదెబ్బ కొట్టినట్టయింది.