Balakrishna dance steps: సాధారణంగా ఒక హీరో డాన్స్ వేస్తున్నాడు అంటే ఆ డాన్స్ ప్రేక్షకులను మెప్పించ గలిగాలి. అయితే దీనికి కారణం కొరియోగ్రఫీ.. అందించే కొరియోగ్రాఫర్ దే అని చెప్పవచ్చు. కొరియోగ్రాఫర్ హీరో వయసుకు తగ్గట్టుగా.. డాన్స్ మ్యాచ్ చేయలేకపోతే విమర్శలు ఎదుర్కోక తప్పదు.
ప్రముఖ స్టార్ హీరో బాలకృష్ణ..తాజాగా నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ సినిమా నుంచి తాజాగా ఐటమ్ సాంగ్ విడుదల చేశారు. దబిడి దిబిడి అంటూ వచ్చిన ఈ సాంగ్ కు సంబంధించిన లిరికల్ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ సినిమా పాట విడుదలైనప్పటి నుండి.. ఈ పాటకు, అందులోని స్టెప్పులకు నెగిటివ్ రెస్పాన్స్ లభించడం గమనర్హం. ఇది చూసిన చాలామంది ఏంటిది మాస్టారు అంటూ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి దబిడి దిబిడి అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో ఊర్వశీ రౌటేలా, బాలయ్యతో కలిసి స్టెప్పులేసింది. ఊర్వశి ఇందులో ఐటమ్ సాంగ్ చేస్తోందని తెలిసినప్పుడు.. ఈ సాంగ్ విడుదల కాకముందు.. భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ లిరికల్ వీడియోకి మాత్రం విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. దీనికి ప్రధాన కారణం బాలయ్య, ఊర్వశి కలిసి వేసిన స్టెప్పులే. సాధారణంగా బాలయ్య వేసే స్టెప్పులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ వయసులో కూడా అద్భుతంగా డాన్స్ చేస్తారని అభిమానులు మురిసిపోతూ ఉంటారు. కానీ దానికి చాలా వరకు ఒక క్రెడిట్ కొరియోగ్రాఫర్స్ కి కూడా వెళ్లాల్సిందే.
బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా వారు స్టెప్స్ కంపోజ్ చేస్తేనే అవి స్క్రీన్ పై చాలా అందంగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి అభ్యంతరంగా మారే స్టెప్పులు బాలయ్య చేత కొరియోగ్రాఫర్ వేయించినట్టు కనిపిస్తున్నాయి. అలాంటి స్టెప్పులు వేయడం కరెక్ట్ కాదని ఎంతోమంది ఫీల్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు శేఖర్ మాస్టర్ పై విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం.