Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2025-26కి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Budget 2025: కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. పలు వర్గాలు తమకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ధరలు ఇంకా ఆశించినంతగా దిగిరాలేదు. మరోవైపు వడ్డీరేట్లు అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
నిరుద్యోగం తగ్గించే దిశగా ఉపాధికల్పన కోసం గత బడ్జెట్ లో కేంద్రం పలు స్కీములు, విధానాలను ప్రకటించింది. ఈసారి కూడా వాటని కొనసాగించాలని తయారీ, సేవా రంగ పరిశ్రమలు కోరతున్నాయి.
పెట్రోల్ ధరలు ఇంకా అధిక ధరల్లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ దిశగా కేంద్రం ఏదైనా ఉపశమనం కల్పించాలని పేద, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. మరోవైపు గత కొన్నేళ్లుగా ఇన్ కమ్ ట్యాక్స్ విషయంలో కేంద్రం వేతన జీవులకు నిరాశే మిగులుస్తోంది. ఈసారైనా తమకు కొంత వెసులుబాటు కల్పించి భవిష్యత్తుపై పెట్టుబడులపై అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రంగాలు బడ్జెట్ నుంచి ఆశిస్తుందే ఏంటో చూద్దాం.
పెట్రోధరలపై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే స్థూలంగా పెట్రోల్, డీజిల్ ధఱలు కొంతవరకు దిగివస్తాయి. దాని ఫలితం పరోక్షంగా ట్రాన్స్ పోర్టేషన్, లాజిస్టిక్స్ పై ఉంటుంది. చివరకు నిత్యావసర ధరలు కూడా తగ్గి సామాన్యులపై భారం తగ్గుతుంది.
ఆర్థిక మద్ధతు, సుంకాల తగ్గింపు, పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయని ఈసారి వస్త్ర పరిశ్రమ ఆశిస్తోంది. బంగ్లాదేశ్ లో పరిస్ధితులు వస్త్ర పరిశ్రమకు సవాల్ విసురుతున్న నేపథ్యంలో లోకల్ ప్రొడక్షన్ పెంచే దిశగా ప్రభుత్వ ప్రకటనలు ఉండవచ్చని భావిస్తున్నారు.