Dubai Heavy Rains: ఆసియా నుంచి దక్షిణ తూర్పు ఆసియా వరకూ వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చాయి. దుబాయ్లో ఆకశ్మిక వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరమంతా జలమయమైపోతుంది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉన్నా రోడ్లపై నీరు నిలిచిపోతోంది. అటు ఇండోనేషియాలో భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటం కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులపాలవుతుంది. చాలా ప్రాంతాలు వరద ముప్పులో ఉన్నాయి.
ఇండోనేషియాలో పెద్ద సంఖ్యలో జనం కొండప్రాంతాల్లో నివసిస్తుంటారు. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడుతుంటాయి. ఈసారి అదే పరిస్థితి తలెత్తడంతో చాలామంది మరణించారు.
మరోవైపు ఇండోనేషియాలో తుపాను విపత్తు ముంచుకొచ్చింది. మార్చ్ 8న కురిసిన భారీ వర్షాలతో వరద ముంచెత్తింది. అటు భూమి కూడా కంపించడంతో 19 మంది మృత్యువాత పడ్డారు.
దుబాయ్ సాధారణంగా వేడి వాతావరణమే ఉంటుంది. చలికాలంలో జనవరి నెలలో కూడా 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అక్టోబర్ నెలలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతం భారీ వర్షాలతో దుబాయ్ నగరం అతలాకుతలమైంది.
దుబాయ్లో రానున్న వందేళ్లు ఏ సమస్యా రాని విధంగా డ్రైనేజ్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు 18 లక్షల కోట్లు మంజూరు చేశారు. కొత్త డ్రైనేజ్ వ్యవస్థను తయారు చేస్తారు. ఈ పనులు జరుగుతుండగానే భారీ వర్షాలు అస్తవ్యస్తం చేశాయి.
దుబాయ్లో భారీ వర్షాలతో పరిస్థితి నరకప్రాయంగా మారుతోంది. గత ఏడాది నవంబర్ నెలలో కూడా ఇదే తరహాలో భారీ వర్షాలు సంభవించాయి. ఈసారి భారీ వర్షాలతో రోడ్లపై పెద్దఎత్తున నీరు చేరుకుపోయింది.
యూఏఈలోని చాలా నగరాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. దుబాయ్ అత్యధిక ప్రభావం కన్పిస్తోంది. రోడ్లపై నీరు చేరుకుంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి.