Tollywood IT Raids: బాలీవుడ్ మాఫియా ప్రభావంపై పుకార్లు కొత్తవి కావు. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఇలాంటి పుకార్లు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, అభిషేక్ అగర్వాల్ సంస్థలపై ఐటీ దాడులు జరగడంతో ఈ చర్చలు మరింత పెరిగాయి. తాజాగా బాలీవుడ్ మాఫియా టాలీవుడ్‌ను లక్ష్యం చేసిందని.. ఐటీ దాడులు జరిపించింది అని పుకార్లు వినిపిస్తున్నాయి, కానీ దీనిపై ఎటువంటి రుజువు అయితే లేదు.
బాలీవుడ్ మాఫియా సౌత్ లో కంటే నార్త్ లో చాలా మందికి తెలుసు. దాని గురించి పుకార్లు చాలా కాలంగా ఉన్నాయి. అక్కడి మాఫియా ఏ నటులను ప్రోత్సహించాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎవరిని అణగదోక్కాలి వంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని అంటూ ఉంటారు. ఎవరైనా బాలీవుడ్‌లోకి ప్రవేశించాలి అన్నా వీళ్ళను దాటకుండా చాలా కష్టం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు.
ఇప్పుడు వాళ్ళ గురించిన గాసిప్స్ టాలీవుడ్‌లోనూ వినిపిస్తున్నాయి. తాజాగా మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థలు పాన్-ఇండియా ప్రాజెక్టులు ఎక్కువగా నిర్మిస్తూ ఉంటాయి. పుష్ప 2, కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి చిత్రాలతో హిందీ ఆడియన్స్‌ను కూడా బాగానే ప్రభావితం చేశాయి.
మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ విజయానికి తర్వాత గోపీచంద్ మలినేనితో జాట్ అనే సినిమాను నిర్మిస్తోంది. దీనికోసం పలు బాలీవుడ్ స్టార్‌లకు కూడా అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. దిల్ రాజు ప్రొడక్షన్స్ అమీర్ ఖాన్‌తో కలిసి పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయనున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ గూఢచారి, కార్తికేయ 3 వంటి చిత్రాలకు సహనిర్మాతగా పనిచేస్తూ వ్యాక్సిన్ వార్ అనే మరో ప్రతిష్ఠాత్మక పాన్-ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో ఈ సమయంలో ఐటీ దాడులు జరగడం వల్ల ఇది బాలీవుడ్ మాఫియా పని అని పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కుంటుండగా, టాలీవుడ్ పాన్-ఇండియా విజయాలు సాధిస్తూ బాలీవుడ్‌ను వెనక్కి నెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మాఫియా ప్రమేయం చేసుకుని, ఇలా టాలీవుడ్‌కు వార్నింగ్ ఇచ్చింది అని కొందరు అంటున్నారు.
అయితే, ఈ దాడులు కేవలం సాధారణ ఐటీ చర్యలు కూడా కావచ్చు. మాఫియా జోక్యం ఉన్నట్లు ఎలాంటి రుజువు కూడా లేదు. కానీ ఈ సంఘటనలు ఈ పుకార్లకు ఆజ్యం పోశాయి.