Ratha Sapthami arka tradition: రథ సప్తమి రోజున చాలా మంది తలమీద జిల్లెడు ఆకుల్ని పెట్టుకుని స్నానం చేసే ఆచారాలను పాటిస్తుంటారు. దీని వెనుకాల విశేషమైన కారణముందని పండితులు చెబుతున్నారు.
మాఘమాసంలో వచ్చే సప్తమిని రథసప్తమిగా పిలుస్తుంటారు. ఈ రోజున సూర్యజయంతిగా కూడా జరుపుకుంటారు. సూర్యుడు మనకు కంటికి కన్పిస్తున్న దేవుడిగా చెప్తుంటారు.
సూర్య భగవానుని రధానికి 7 అశ్వాలు ఉంటాయి. ఈ ఏడు అశ్వాలు ఏడు రంగులకు, ఏడు వారాలకు ప్రతీకలుగా చెబుతుంటారు. మనకు వేదాలు, ఇతిహాసాలలో సూర్యుడి ఆరాధన గురించి చెప్పబడింది.
శ్రీరాముడు రావణ సంహార సమయంలో సూర్యుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని రాముడు పఠించాడు. అదే విధంగా.. ధర్మరాజు వెంట అడవికి వచ్చిన పౌరులకు ఆహారం సమకూర్చేందుకు సూర్యోపాసన చేశాడు.
దీంతో సూర్య భగవానుడు ప్రసన్నుడై.. అక్షయపాత్రను ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే.. రథ సప్తమి రోజున చాలా మంది సూర్యొదయానికి ముందే నిద్రలేచి జిల్లెడు ఆకుల్ని తలమీద పెట్టుకుని స్నానం చేస్తారు.
జిల్లెడు ఆకుల్ని అర్కపత్రాలు అని కూడా చెబుతుంటారు. అర్కపత్రాలు సూర్యుడికి ఎంతో ప్రీతీకరమైందంట. దీని పువ్వులు, ఆకులతో సూర్యుడ్ని పూజిస్తే ఆయన ప్రసన్నడవుతారంట. అందుకే చాలా మంది రథ సప్తమి రోజున జిల్లెడు ఆకుల్ని తలమీద పెట్టుకుని స్నానం చేస్తారు.
ఈ ఆకులతో స్నానం చేయడం వలన గ్రహాదోషాలు, వాస్తు సంబంధ దోషాలు పోతాయంట. అదే విధంగా.. శరీరంలోని వేడి తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్స్ దూరం చేస్తుంది. దీనిని ఆంగ్లలో బెలడోనా అని కూడా అంటారు. ఈ ఆకుల నుంచి వచ్చిన పాలను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు.
జిల్లెడు చెట్టు కాండంతో తెల్ల జిల్లెడు వినాయకుడు తయారవుతారని చెబుతుంటారు. తెల్ల జిల్లెడు గణేషుడ్నిఆరాధిస్తే అన్ని రకాల సమస్యలు దూరమౌతాయంట. రథ సప్తమి రోజున వాకిళ్లలో చాలా మంది బొగ్గులపొయ్యి మీద చిన్న గిన్నె పెట్టి పాలు, చక్కెర, బియ్యంను పెట్టి పాయసం చేసి సూర్యుడికి నైవేద్యంగా పెడతారు. రథం ముగ్గును తప్పకుండా వేస్తారు.