varalakshmi vratham 2024 prasadam : వరలక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు ఇవే..వీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి

varalakshmi vratham 2024 Recipes: ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణమాసం షురూ అవుతుంది. ఈ మాసం అంతా కూడా పూజతోనే గడిసిపోతుంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఈసారి ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీవ్రతం వస్తోంది. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేసి..నైవేద్యంగా  సమర్పించండి. ఆ ప్రసాదాలేవో తెలుసుకుందామా? 

1 /6

varalakshmi vratham 2024: శ్రావణమాసంలో అత్యంత ముఖ్యమైన పర్వదినం శ్రావణ శుక్రవారం నాడు జరిపే వరలక్ష్మీదేవి వ్రతం. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 16వ తేదీన ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇంటికి వచ్చిన అతిథులకు ప్రసాదంగా పెట్టినట్లయితే వరలక్ష్మి దేవి కరుణ కటాక్ష వీక్షణకు మీరు పాత్రులు అవుతారు. వరలక్ష్మి దేవి వరాలను కురిపించే మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ముఖ్యంగా పులిహార, పొంగలి, పాయసం, రవ్వ కేసరి, బూరెలు ఉంటాయి  

2 /6

పులిహార:వరలక్ష్మి దేవి వ్రతం రోజు పులిహారను నైవేద్యంగా పెట్టవచ్చు. ముందుగా దీని తయారీకి కావలసిన పదార్థాలు బియ్యం. చింతపండు. పోపుదినుసులు. ఇంగువ ఎండు మిరపకాయలు. కరివేపాకు. ప్రధానంగా అవసరం అవుతాయి. ఇప్పుడు అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత చింతపండు నుంచి  రసాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి  నూనె కాగిన తర్వాత పోపు దినుసులు ,వేరుశనగ, ఎండు మిరపకాయలు, పసుపు, ఇంకువ వేసి కలుపు కోవాలి. ఆ తర్వాత ఇందులో చింతపండు పులుసు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నానికి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు రుచికరమైన పులిహార సిద్ధం అవుతుంది.  

3 /6

పొంగలి: పొంగలి తయారీకి కావలసిన పదార్థాలు.. బియ్యం, పెసరపప్పు, మిరియాలు, నెయ్యి, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు అవసరం అవుతాయి. ఇప్పుడు ముందుగా అన్నం పెసరపప్పు కలిపి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కాగిన అనంతరం అందులో మిరియాలు, పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ నేతి మిశ్రమంలో ఉడికిన అన్నం పెసరపప్పు మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత మెత్తగా పప్పు గుత్తితో బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. చివరలో నెయ్యిలో జీడిపప్పు  తాలింపు పొంగలి పై వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. రుచికి తగ్గ ఉప్పును కలుపుకోవాలి. కారం సరిపోని వారు పచ్చిమిరపకాయలను కూడా వాడుకోవచ్చు.

4 /6

రవ్వ కేసరి: రవ్వ కేసరి కి కావలసిన పదార్థాలు.. బొంబాయి రవ్వ, నెయ్యి ,పంచదార, జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష, పైనాపిల్ ముక్కలు. ముందుగా ఒక బాణలిలో బొంబాయి రవ్వ వేసి కాస్త నెయ్యి పోసి సన్నగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో నెయ్యి పోసుకోవాలి. అనంతరం అందులో జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరిగిన అనంతరం రుచికి తగ్గ పంచదార వేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన రవ్వను నీరు మసులుతున్నప్పుడు  నెమ్మదిగా గరిటతో కలుపుతూ రవ్వను పోసుకోవాలి. రవ్వ ఉండలు కట్టకుండా జాగ్రత్తపడాలి. చివరిలో పైనాపిల్ ముక్కలు వేసుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు రుచికరమైన రవ్వ పొంగలి సిద్ధం అవుతుంది.

5 /6

పాయసం: పాయసం తయారీకి కావలసిన పదార్థాలు ..బియ్యం, పాలు, కొబ్బరి తురుము, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, అలాగే కుంకుమ పువ్వు అవసరం.  ముందుగా అన్నం ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలను మరిగించి అందులో బెల్లం కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో అన్నం వేసి అలాగే కొబ్బరి తురుము యాలకులు వేసుకోవాలి. చివరలో మరో గిన్నెలో నెయ్యి తాలింపు వేసి అందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి వేయించి ఇప్పుడు ఈ తాలింపును పాయసంలో వేయాలి. ఆ తర్వాత చివరలో యాలకులు, కుంకుమపువ్వు చల్లుకుంటే పాయసం చాలా రుచికరంగా ఉంటుంది.

6 /6

బూరెలు: ముందుగా మినప్పప్పు నానబెట్టుకొని ఆ తర్వాత పిండిగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నానబెట్టిన శనగపప్పును బెల్లము కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా ఎన్నుకొని యాలకులు వేసుకోవాల్సి ఉంటుంది.  ఆ తర్వాత ఈ మెత్తటి శెనగ పప్పు, బెల్లం మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండాలను మినప పిండిలో ముంచి నూనెలో వేయించుకుంటే బూరెలు సిద్ధం అవుతాయి.