హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను తీవ్ర నష్టానికి గురిచేశాయి. ఒకవైపు వరి పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలతో వరి నేల రాలి పంటకోసే అవకాశం కూడా లేకపోగా ఇంకొంత మంది రైతుల విషయంలో చేతికి అందొచ్చిన పంట మార్కెట్ యార్డుకు తరలించేలోపే కల్లంలోనే నీటిపాలైంది. మరికొన్ని చోట్ల మార్కెట్ యార్డుల్లోనే ధాన్యం తడిసిముద్దయింది. ఈ అనుకోని పరిణామంతో దిగాలు పడిన రైతులకు భరోసా ఇస్తూ అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ భరోసా ఇచ్చారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. ధాన్యం తరలింపు, కొనుగోలు, తడిసిన ధాన్యం, గోనె సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారుల సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని కమిషనర్ అకున్ సభర్వాల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మరో 4 రోజులపాటు వర్షాలు కురిసే సూచనలున్నాయనే వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన టార్ఫాలిన్లను సమకూర్చుకోవాలని కమిషనర్ సూచించారు.