2018లో దేశంలోనే ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేసే విధంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారుచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అందుకే ఈ సంవత్సరాన్ని ప్రకృతి సేద్య నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లాలో ప్రముఖ వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ నేతృత్వంలో జరుగుతున్న ప్రకృతి సేద్య శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం మాట్లాడుతూ "ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా మంచి ధర పలుకుతుందని, ఈ ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలన్న విషయంపై రైతులు ఆలోచించాలని.. అటువంటి పంటలు పండించాలని, రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.700 కోట్లతో దాదాపు 12.50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను నిర్మించడానికి సంకల్పిస్తున్నాయని, జీరో బడ్జెట్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించడానికి పథకాలు తీసుకొస్తాయని" తెలిపారు.