ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. నేతలు ఏ పార్టీలో ఉండాలి.. ఏ పార్టీలో ఉండకూడదు.. ఫలానా పార్టీలో ఉంటే గెలవచ్చు అని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ (సెప్టెంబర్ 2) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి వైకాపాలో చేరనున్నట్లు తెలియవచ్చింది. విశాఖపట్టణంలో పాదయాత్రలో ఉన్న జగన్ ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పనున్నారు.
వైఎస్‌తో ఆనంకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. వైయస్ హయాంలో 2007-2009 వరకు ఆనం ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, సినిమాట్రోగ్రఫీ, టూరిజం మంత్రిగా పనిచేశారు. జూలై 2009లో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ఆర్థికశాఖ మంత్రిగా ఆనం పనిచేశారు.
రాంనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ రెండు సందర్భాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఎన్.టి. రామారావు యొక్క మంత్రివర్గంలో రహదారులు మరియు భవనాల శాఖమంత్రిగా పనిచేసిన ఈయన.. 1991లో కాంగ్రెస్‌లో చేరారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో చేరిన తర్వాత పార్టీ తనకు ఆశించినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ వార్తకు బలం చేకూర్చేలా ఇటీవలే ఆయన వైసీపీ నేతలతో భేటీ అయ్యారు.