అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం మధ్యాహ్నం కర్నూలులో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక రాహుల్ తొలిసారి ఏపీ పర్యటనకు వస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాహుల్‌గాంధీ తొలిసారి కర్నూలు జిల్లాకు రానున్నడంతో కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం నగరంలోని ఎస్టీబీసీ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుక బడిన ప్రాంతాలకు ప్యాకేజీ, నిరుద్యోగులకు ఉపాధి, రైతు రుణమాఫీ తదితర అంశాలపై మరోసారి ఆయన వాగ్దానం చేసే అవకాశం ఉంది.
రాహుల్ పర్యటన ఇలా:
రాహుల్ గాంధీ మధ్యాహ్నం కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం కొద్దిసేపు నేతలతో ముచ్చటించి.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం కర్నూలు నగర శివార్లలోని ఫంక్షన్ హాలులో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. భోజనా విరామం అనంతరం.. కోట్ల కిసాన్ ఘాట్‌కు చేరుకొని దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి నివాళులు అర్పిస్తారు. ఆతర్వాత ఎస్టీబీసీ గ్రౌండ్స్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి ఊమెన్ చాందీ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు తదితరులు ఈ పర్యటనకు హాజరుకానున్నారు.
ఏపీలో టీడీపీతో కలిసే సమస్యే లేదు: ఊమెన్ చాందీ
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో అక్కడి అవసరాలు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీతో పొత్తు ఉండవచ్చని, ఏపీలో మాత్రం అలా జరిగే అవకాశాలు లేవని అన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.