AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఏపీ పాలిటిక్స్ మొత్తం కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పదేపదే చెబుతుండటం, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలతో పొత్తుల దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు వచ్చాయి. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ మంతనాలు సాగించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ జాతీయ మీడియాలో కథనాలు రావడంతో... ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైందని.. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందనే చర్చ సాగుతోంది.
తాజాగా ఏపీ రాజకీయాలు.. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుకు సంబంధించి కమలం పార్టీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ వారసత్వ పార్టీలతో కలిసే ప్రసక్తేలేదని చెప్పారు ఏపీ బీజేపీ కో ఇంచార్జ్ సునీల్ దేవధర్. ప్రస్తుతం తాము ఏపీలో జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని.. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీతోనే కలిసి పోటీ చేస్తామని చెప్పారు. అవినీతి పార్టీలైన వైసీపీ, టీడీపీకి దూరంగా ఉంటామన్నారు సునీల్ దేవధర్. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఉన్న సునీల్ దేవధర్ చేసిన కామెంట్లు ఏపీలో సంచలనంగా మారాయి. బీజేపీతో పొత్తు ఖాయమని భావిస్తున్న తమ్ముళ్లకు సునీల్ కామెంట్లు షాకింగ్ గా మారాయి.
అయితే సునీల్ దేవధర్ కు విషయంలో టీడీపీ నేతలు మరో వాదన చేస్తున్నారు. మొదటి నుంచి సునీల్ టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని.. వైసీపీ డైరెక్షన్ లోనే ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పొత్తుల విషయం బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందని.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. చంద్రబాబుతో మాట్లాడిన విషయాలు సునీల్ కు తెలిసి ఉండకపోవచ్చన్నారు.
ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చిన మంత్రి అమిత్ షా.. రామోడీ ఫిల్మ్ సిటీకి వెళ్లి ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును కలిశారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. వీళ్లిద్దరి సమావేశాల్లో ఏపీ రాజకీయాలు ప్రధానంగా చర్చించారని... టీడీపీ, బీజేపీ పొత్తు అంశం చర్చకు వచ్చిందనే టాక్ నడుస్తోంది. తారక్ టీడీపీకి ప్రచారం చేస్తే తాము పొత్తు పెట్టుకుంటామని అమిత్ షా చెప్పారనే వార్తలు వచ్చాయి. మోడీతో చంద్రబాబు భేటీ. అమిత్ షాతో జూనియర్ సమావేశం వైసీపీని కలవరానికి గురి చేసిందని అంటున్నారు. అందుకే సునీల్ దియోధర్ తో ఇలా ప్రకటనలు చేయిస్తున్నారని కొందరు టీడీపీ నేతలు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి