దేశంలోని ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ కోసం ఇవాళ అంటే నవంబర్ 24న భేటీ అయిన సుప్రీంకోర్టు కొలీజీయం సిఫారసు చేసింది. ఇందులో ఏపీకు చెందిన జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి రమేష్ ఉన్నారు. జస్టిస్ దేవానంద్ బదిలీ వెనుకు ఏపీ ప్రభుత్వ ప్రమేయం ఉందా అనే అనుమానాలొస్తున్నాయి.
ఏపీ హైకోర్టులో జస్టిస్ బట్టు దేవానంద్ సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఈయనను ఏపీ నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 2020 జనవరి 13వ తేదీన హైకోర్టు న్యాయమూర్తిగా బాథ్యతలు స్వీకరించిన జస్టిస్ బట్టు దేవానంద్..పలు సంచలన తీర్పులు ఇచ్చారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ఇచ్చిన సంచలన తీర్పుల్లో అధికశాతం ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినవే ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి.
1. పంచాయితీ, పాఠశాలల భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడాన్ని జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా పరిగణించారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని పిలిచి వివరణ సైతం కోరారు.
2. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సుధాకర్ నిర్బంధం వ్యవహారంలో టీడీపీ నేత వంగలపూడి అనిత రాసిన లేఖను సుమోటాగా స్వీకరించి విచారణ జరపడం సంచలనమైంది.
3. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఆరోపితులకు 41 ఏ నోటీసులు ఇవ్వకపోవడంపై తప్పుబట్టారు. ఇందులో భాగంగా డీజీపీ గౌతం సవాంగ్‌ను కోర్టుకు పిలిచి పోలీసు మాన్యువల్ అంటే ఏంటో వివరించాలని కోరారు.
4. సోషల్ మీడియాలో న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై తీవ్రవ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై జస్టిస్ దేవానంద్ కఠినంగా వ్యవహరించారనే వాదన ఉంది.
5. ఇక రాజధాని అమరావతి వ్యవహారమై..కోర్టు బయట ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తిపోసే విధంగా ఉంది. ఢిల్లీలో చదువుతున్న తన కుమార్తెను మీ రాజధాని ఏదంటూ ఆటపట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు.
6. స్థానిక ఎన్నికల సమయంలో, తిరుపతి ఉప ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవహారంపై స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. ఆ పిటీషన్లను అప్పటికప్పుడు విచారణకు స్వీకరించి..వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచారు.
ఇలా పలు కీలక కేసుల్లో జస్టిస్ బట్టు దేవానంద్ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో..ఇప్పుడు బదిలీ వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందా అనే చర్చ ప్రారంభమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook