'గ్రామాల్లోని సమస్యలను చర్చించి, ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా పోరాటం జరిపేందుకు నిడదవోలు యువత తీసుకొచ్చిన రెడ్ రెవల్యూషన్ ప్రోగ్రాం అన్ని ప్రాంతాల వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది' అని అన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. జనసేన పోరాట యాత్రలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా రెడ్ రెవల్యూషన్‌ని ప్రారంభించిన కస్తూరి సత్య ప్రసాద్‌తోపాటు నిడదవోలు నియోజకవర్గంలో పార్టీ కోసం చురుకుగా పనిచేస్తోన్న స్థానిక యువతను వేదికపైకి పిలిచి మరీ అభినందించారు. తాను ఎంతగానో అభిమానించే ప్రాంతమైన నిడదవోలు నుంచే ఈ రెడ్ రెవల్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పవన్ అన్నారు. తన తండ్రి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన నిడదవోలుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
రాజకీయాలు అంటే ఓ బాధ్యత. అందుకే కోట్లు సంపాదించిపెట్టే సినిమాలను వదిలేసి ఈ రాజకీయాల్లోకి వచ్చాను. సామాన్యుల సమస్యల పరిష్కారం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదు.. సాటి మనిషిగా మానవత్వాన్ని చాటుకోవడం ముఖ్యం అని పవన్ తన రాజకీయ రంగప్రవేశం వెనుకున్న కారణాలను వివరించారు. గతంలో టీడీపీ ప్రజల కోసం ఏదో చేస్తుందని నమ్మాను. కానీ ఆ పార్టీ కూడా జనాన్ని మోసం చేస్తోందని గ్రహించాకా తానే నేరుగా రంగంలోకి దిగాను. ఇకపై మాట తప్పిన వారి కుర్చీలు లాగేస్తాం. మీరు భయపెడితే భయపడే వారు ఎవ్వరూ ఇక్కడ లేరు. వెన్నుపోటు పొడిచి, ఏడిపించి పంపిస్తే, వెళ్లిపోవడానికి తాను ఎన్టీఆర్‌ను కాను. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాను ప్రజల మధ్యలోంచి వెళ్లిపోను అని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు.