ఏలూరు: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే చంద్రబాబుకు రైతులు, బీసీలు గుర్తుకొస్తారని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసి గర్జన సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.." సమాజంలో అన్ని కులాలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికి తెలియదని ఎద్దేవా చేశారు. కులాల వారీగా జనాన్ని మోసం చేయడంలో చంద్రబాబు ఏకంగా పీహెచ్డీ చేశారు అని జగన్ తనదైన స్టైల్లో చమత్కరించారు. ఇదే వేదికపై నుంచి ‘అన్నదాతా సుఖీభవ’ పథకం గురించి స్పందిస్తూ.. అమలుకు సాధ్యంకాని హామీలతో చంద్రబాబు జనాన్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
రైతు రుణమాఫీ వారి రుణాలపై వడ్డీలకు కూడా చాలడం లేదు కానీ అదేమీ పట్టించుకోని చంద్రబాబుకు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే భయంతో ఉన్నట్టుండి రైతులు గుర్తొచ్చారు. అందుకే అన్నదాతా సుఖీభవ అంటూ మరోసారి వారిని మభ్యపెట్టేందుకు కుట్ర చేస్తున్నారు అని చంద్రబాబుపై జగన్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. బీసీలు నాకు వెన్నెముక లాంటి వాళ్లు అని తరచుగా చెప్పుకునే చంద్రబాబు వాళ్లను కరివేపాకులా ఎన్నికలు వచ్చిన ప్రతీసారి వాడుకుని వదిలేస్తున్నారని, ఇప్పటికీ మన సమాజంలో బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.