AP Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు సహాయంతో ప్రవేశించిందని వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పగటి పూట బీజేపీతో చంద్రబాబు కాపురం చేస్తాడు.. రాత్రిపూట కాంగ్రెస్‌తో కాపు ఉంటాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండగా అభివర్ణించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కడపలో సీఎం జగన్ పర్యటించారు. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు తలపై టోపీ, భుజంపై రుమాలు ధరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితులను గుర్తుచేస్తూనే కాంగ్రెస్‌ను దెప్పిపొడిచారు. 'వైఎస్సార్ చనిపోయాక ఆయనపై కుట్రలు ఎవరు చేశారు? వైఎస్సార్ పేరును చార్జిషీటులో పెట్టింది ఎవరు? వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని కుట్రలు చేసింది ఎవరు? వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్సార్ వారసులు' అని జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలతో పరోక్షంగా వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై విమర్శలు చేశారు.
Also Read: YS Sharmila Tears: వైఎస్ జగన్ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ షర్మిల
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచపు రాజకీయాన్ని జగన్ తిప్పికొట్టారు. 'కాంగ్రెస్‌కు వైఎస్సార్ అభిమానులు ఎప్పుడో సమాధి కట్టారు. వైఎస్సార్ పేరును సమాధి చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. రాజకీయ స్వలాభం కోసం.. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎన్నికల సమయంలో నాన్న సమాధి దగ్గరకు వెళ్తారంట. వైఎస్సార్ మరణం తర్వాత నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని.. అన్యాయంగా నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు' అని గుర్తుచేశారు. నోటాకు పడినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా? అని నిలదీశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్లేనని తెలిపారు.
చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. 'తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషే. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో చంద్రబాబు కాపురం చేస్తాడు. ఆయన కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది' అని సీఎం జగన్ తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తమని బీజేపీతో జత కడుతూనే చంద్రబాబు మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ అంశాల్లో మైనార్టీలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ విషయాన్ని చంద్రబాబు మోదీ సభలో చెప్పగలడా? అని సవాల్ విసిరారు.
అనంతరం ఐదేళ్లుగా తన ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి పనుల విషయమై ప్రచారంలో సీఎం జగన్ వివరించారు. ఇదే సంక్షేమం, అభివృద్ధి మోడల్‌ను రాబోయే ఐదేళ్ల కాలంలో కూడా కొనసాగిస్తామని చెప్పారు. బాబు జీవితమంతా అబద్ధాలు, మోసాలు, కుట్రలు అని పేర్కొన్నారు. చంద్రబాబు దోచుకున్న డబ్బులు భారీగా ఉన్నాయని.. ఎన్నికల్లో బాబు డబ్బులు ఇస్తే వద్దనకండి.. తీసుకోండి అని ప్రజలకు జగన్ సూచించారు. వలంటీర్ల సేవలు కొనసాగాలంటే.. పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter