ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు (69) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. మొదటి నుంచి విప్లవ భావజాలం ఉన్న రంగారావు అదే తరహా సినిమాలు తీసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్రపావురాలు’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’ మొదలైన చిత్రాల్లో నటించారు. నవతరం ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను సైతం స్థాపించారు.
రంగారావు తాను నిర్మించిన చిత్రాల ద్వారా వచ్చిన లాభాన్ని సీపీఎం పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోని థియేటర్లలో తన సినిమాలను ప్రదర్శించడం ద్వారా వచ్చిన లాభాన్ని స్థానిక సీపీఎం కార్యాలయాలకు విరాళంగా అందించేవారు. తను నమ్మిన భావజాలాలనే కథాంశాల రూపంలో ఆయన సినిమాల ద్వారా చూపించేవారు.
ప్రకాశం జిల్లా మైనం పాడు గ్రామంలో 1948 మే 25న జన్మించిన మాదాల రంగారావు తొలుత విలన్ పాత్రలు పోషించినా.. ఆ తర్వాత విప్లవాత్మకమైన భావాలతో, ప్రజల సమస్యలతో కూడిన కథనాలతో సినిమాలు తీశారు. ఆయన తన సినిమాల్లోని పాటలను జానపద కళాకారుల చేతే పాడించేవారు. ఆయన సినిమాల్లోని నాంపల్లి స్టేషన్ కాడా రాజా లింగో, కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడా, అమరవీరులెందరో అనే పాటలు అత్యంత ప్రజాదరణను పొందాయి
రంగారావు నవతరం ప్రొడక్షన్స్ పతాకంపై 1980లో తీసిన ‘యువతరం కదిలింది’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం లభించింది. ఫిలిం నగర్లోని ఆయన కుమారుడు మాదాల రవి ఇంటికి రంగారావు మృతదేహాన్ని తరలించారు. మాదాల రంగారావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.