పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం ఐఆర్సీటీసీ సరఫరా చేసిన అల్పాహారం తీసుకున్న 33 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో 14 మంది ఖరగ్‌పూర్‌లోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సౌత్-ఈస్ట్ రైల్వే జోన్ ప్రజా సంబంధాల అధికారి సంజయ్ ఘోష్ తెలిపారు. ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలోని జగన్నాధ్ స్వామి దర్శనం కోసం వచ్చిన పశ్చిమ బెంగాల్‌కి చెందిన భక్తులు బుధవారం ఉదయం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుప్రయాణమయ్యారు. రైలు భువనేశ్వర్ దాటిన తర్వాత అల్పాహారంగా ఐఆర్సిటీసీ సరఫరా చేసిన బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నామని, ఆ తర్వాతే కడుపులో నొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యామని బాధితులు మీడియా ఎదుట వాపోయారు.
ఇదే విషయాన్ని రైలు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా ఖరగ్‌పూర్ రైల్వే ఆస్పత్రిలో చేర్పించారని బాధితులు తెలిపారు. పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఘటనపై ఆలస్యంగే మేలుకున్న రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనపై స్పందించిన ఖరగ్‌పూర్ డివిజన్ మేనేజర్ రాబిన్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆహార పదార్థాల నమూనాలు సేకరించాం. బాధ్యులైన వారిపై చర్యలు చేపడతాం’ అని చెప్పారు.