న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాల వారి హక్కుల కోసం ఉద్యమించేందుకు మనదేశంలో వివిధ ఐఐటీల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం 50 మంది ఐఐటీ పూర్వ విద్యార్థులు బృందంగా ఏర్పడ్డారు. చేస్తున్న ఉద్యోగాలను కాదని 'బహుజన ఆజాద్ పార్టీ'(బీఏపీ)ని ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచి చూస్తున్నారు.
ఢిల్లీ ఐఐటీలో 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్ధి నవీన్‌కుమార్ ఈ బృందానికి సారథ్యం వహిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చేలోగా క్షేత్రస్థాయి కార్యకలాపాలను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికలు తమ లక్ష్యం కాదని ఈ బృందం స్పష్టం చేసింది. తమ అభిప్రాయాలను, పార్టీ లక్ష్యాలను వివరించారు. ఎస్సీలకు సబ్బు, నూనెల పంపిణీ చేయడం కాదని, వారి హక్కులు, వాటా ఇప్పించాలని కోరారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీకి చెందిన రాజకీయ నాయకులు పరాన్నజీవులుగా బతుకుతున్నారన్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలకు వారు బానిసలని ఆరోపించారు. ఎస్టీలు దేశానికి ఆస్తి అని, అప్పు కాదని నిరూపిస్తామని బృందం సభ్యులు అన్నారు. ఎన్నికల కోసం తాము హడావుడి చేయడం లేదని.. 2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఆతరువాత వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు.