మొరాదాబాద్: లోక్ సభ ఎన్నికలు 3వ విడత పోలింగ్‌లో భాగంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఓ అధికారిపై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. 231వ పోలింగ్ కేంద్రంలో విధుల్లో పాల్గొన్న అధికారి మహమ్మద్ జుబైర్ ఈవీఎంలో సైకిల్ గుర్తుపై వున్న మీట నొక్కాల్సిందిగా ఓటర్లకు సూచిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపి కార్యకర్తలు అతడిపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఓ వీడియోను ట్విటర్ ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకుంది.
#WATCH Moradabad: BJP workers beat an Election Official at booth number 231 alleging he was asking voters to press the 'cycle' symbol of Samajwadi party pic.twitter.com/FokdXCAJ1z
— ANI UP (@ANINewsUP) April 23, 2019
ఇదిలావుంటే, ఇదే తరహాలో ఇటాలోనూ ఓ పోలింగ్ కేంద్రంలో విధుల్లో పాల్గొన్న యోగేష్ కుమార్ ప్రిసైడింగ్ అధికారి ఓటర్లు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఒత్తిడి చేస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు అతడిని విధుల్లోంచి తొలగించారు. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం మంగళవారం ఈవీఎంల వినియోగంపై పలు ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయించాయని లేదా వేసిన ఓట్లు కూడా బీజేపికే పడేలా హ్యాక్ చేశారని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.