న్యూఢిల్లీ: సాధ్వీ ప్రగ్యా సింగ్ థాకూర్‌కి కేంద్ర ఎన్నికల సంఘం మూడోసారి నోటీసులు జారీచేసింది. భోపాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్థిగా పోటీచేస్తోన్న సాధ్వీ ప్రగ్యా సింగ్.. తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్‌ని ఉగ్రవాదిగా సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీచేసింది. 26/11 దాడుల్లో ఉగ్రవాదులతో పోరాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన హేమంత్ కర్కరే తన శాపం వల్లే చనిపోయాడని చెప్పి మొదటిసారి ఇసి నోటీసులు ఎదుర్కున్న సాధ్వీ ఆ తర్వాత బాబ్రి మసీదు కూల్చివేతలో తాను కూడా ఓ చెయ్యి వేసినందుకు సంతోషిస్తున్నానని వ్యాఖ్యానించిన ఘటనలో మరోసారి ఇసి నోటీసులు అందుకన్న సంగతి తెలిసిందే.
భోపాల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని సోహోర్లో గురువారం జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో సాధ్వీ పాల్గొని మాట్లాడుతూ.. స్థానిక లోక్ సభ ఎన్నికల పోరులో ఓ సన్యాసికి మరో ఉగ్రవాదిని ఓడించాల్సిన అవసరం ఏర్పడింది అని సంబోధించారు. సరిగ్గా సాధ్వీ చేసిన ఈ వ్యాఖ్యలే ఆమెను మరో వివాదంలోకి నెట్టాయి. భోపాల్‌లో ప్రధాన పోటీ బీజేపి, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉన్నందున.. తమ పార్టీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సాధ్వీ వ్యాఖ్యలపై ఆమెకు నోటీసులు జారీ చేసిన కేంద్రం.. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ని ఆదేశించింది.