దిహేగ్ (నెదర్లాండ్స్): జాతిపిత మహాత్మ గాంధీ 148వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయం మరియు అక్కడి ప్రభుత్వం సంయుక్త ప్రకటన చేశాయి.ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం అక్టోబర్ 1, 2 తేదీల్లో హేగ్ నగరంలో ‘ఫాలో ది మహాత్మా’ పేరుతో ప్రత్యేక సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమాల్లో అహింసా సిద్ధాంతాన్ని బలపరిచే వివిధ అంతర్జాతీయ సంస్థలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిథులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. అలాగే అక్టోబర్ 1వ తేదీన నెదర్లాండ్స్ దేశ రాజధానిలోని పీస్ ప్యాలెస్ నుంచి గ్రోట్‌కెర్క్ వరకు ‘గాంధీ మార్చ్’ చేపట్టనున్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా మహాత్మా గాంధీ వాడిన సైకిల్‌ను నెదర్లాండ్స్ లోని గ్రోటె కెర్క్ వద్ద ప్రదర్శనకు ఉంచుతారు. ఈ సైకిల్‌ను భారత ప్రభుత్వం అధికారికంగా ఆ దేశానికి పంపించింది. అదేవిధంగా గ్రోటెకెర్క్ వద్ద ఉన్న కోర్జో థియేటర్‌లో "సత్యాగ్రహ" పేరుతో ప్రముఖ నెదర్లాండ్స్ కళాకారుడు ఫిలిప్ గ్లాస్ నేతృత్వంలో రూపొందించిన ఒక సంగీత కచేరి కూడా ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే ఒక ప్రత్యేక సభలో ప్రమోద్ కుమార్ అనే భారతీయుడు రచించిన ‘గాంధీ- యాన్ ఇల్యుస్ట్రేటెడ్ బయోగ్రఫీ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.