Karnataka Election Result 2023, Votes Counting Venue, Date and time: కర్ణాటకలో రేపే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కేవలం కర్ణాటకకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా జరగబోయే లోక్ సభ ఎన్నికలపై సైతం ప్రభావం చూపే అవకాశం ఉందన్న నివేదికల నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అంతే ఆసక్తికరంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థల్లో.. న్యూస్ నేషన్ - సీజీఎస్ అలాగే సువర్ణ న్యూస్ - జన్ కీ బాత్ వంటి సంస్థలు ఇచ్చిన ఒకట్రెండు ఫలితాలు మినహాయించి మిగతా అన్ని సంస్థలు దాదాపు కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ స్థానాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ.. హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని తెలిపాయి.
ఒకవేళ హంగ్ కానీ ఏర్పడితే.. కాంగ్రెస్ పార్టీకైనా, బీజేపికైనా.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా.. ఆ పార్టీకి జేడీఎస్ లాంటి థర్డ్ ప్లేయర్ అవసరం తప్పనిసరి అవుతుంది అని ఇంకొన్ని సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ చెప్పకనే చెప్పాయి.
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉండగా మరోవైపు జనతా దళ్ (సెక్యులర్) పార్టీ సైతం తామే కింగ్ మేకర్స్మి అవుతాం అని బలంగా చెబుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపి రెండూ తమని సంప్రదించాయని జనతా దళ్ ( సెక్యులర్ ) పార్టీ అగ్రనేత తన్వీర్ అహ్మెద్ మీడియాకు తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన తన్వీర్ అహ్మెద్.. ఒకవేళ హంగ్ ఏర్పడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమతో కలిసి రావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, బీజేపి రెండూ తమని కలిసి ఆహ్వానించాయని అన్నారు. అయితే, తమ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు చెప్పడానికి సిద్ధంగా లేమని వ్యాఖ్యానించిన తన్వీర్ అహ్మెద్.. సరైన సమయంలో తమ నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టంచేశారు.