కుమారస్వామి మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు కీలక శాఖలు

                       

Last Updated : May 21, 2018, 05:51 PM IST
కుమారస్వామి మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు కీలక శాఖలు

కర్నాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం అభ్యర్ధిగా కుమారస్వామి పేరు ఖరారైంది. ఈ విషయంలో ఇరు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇక మిగిలిందల్లా మంత్రివర్గ కూర్పు. కుమారస్వామి మంత్రి వర్గం ఎలా ఉండబోతోంది. అందులో కాంగ్రెస్ కు ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంటదనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు ఉపముఖ్యమంత్రి పదవులు చెరోపార్టీ తీసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హోంశాఖ లాంటి ప్రధాన శాఖ కాంగ్రెస్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే కీలకమైన ఆర్ధిక శాఖ తమ పార్టీ వారికి లేదంటే తన వద్దే ఉంచుకోవాలని కుమారస్వామి పట్టుబడుతున్నట్లు తెలిసింది. మరోవైపు జేడీఎస్‌ అధినేత కుమారస్వామి నూతన ముఖ్యమంత్రిగా 23న ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఆయన ప్రమాణం చేయనున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో తన కంటే తక్కువ స్థానాలు వచ్చిన జేడీఎస్  పార్టీకి సీఎం పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామి మంత్రివర్గంలో కాంగ్రెస్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు కట్టబెట్టవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేత జె. పరమేశ్వరకు డిప్యూటీ సీఎం అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేడీఎస్‌ నేతలు పుట్టరాజ్‌కి వ్యవశాయ శాఖ, విశ్వానాథ్‌కి విద్యా శాఖ, కాంగ్రెస్‌ నేతలు ఎం. కృష్ణప్పకు క్రీడల శాఖ, కృష్ణ బైరె గౌడకు సమాచార, ప్రచార శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు కూడా వార్తలు వెలువడుతన్నాయి.

Trending News