ఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ కార్మికుడు బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడే అనారోగ్యంతో చనిపోగా.. అతడి శవాన్ని ఇంటికి తీసుకొచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఊర్లో ఉన్న కుటుంబసభ్యులు ఓ డమ్మీ చితికి నిప్పు పెట్టిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌కి చెందిన సునీల్ (38) ఢిల్లీలో ఓ కన్‌స్టక్షన్ కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిరాడు. ఈ నెల 11న అతడికి జబ్బు చేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇదే విషయాన్ని సునీల్ మిత్రులు ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. అదే సమయంలో సునీల్ తన మొబైల్ ఫోన్‌ని ఇంట్లోనే మర్చిపోయాడు. దీంతో సునీల్‌తో మాట్లాడుదామని ఫోన్ చేసిన కుటుంబసభ్యులకు నిరాశే ఎదురైంది. సునీల్ ఎలా ఉన్నాడో ఏమో అని బాధపడుతున్న సమయంలోనే ఏప్రిల్ 14న ఢిల్లీ పోలీసుల నుంచి పిడుగులాంటి వార్త. సునీల్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఢిల్లీ పోలీసులు చెప్పిన చావు కబురు సునీల్ కుటుంబాన్ని షాక్‌కి గురిచేసింది.
సునీల్‌కి భార్య పూనం, నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. పిల్లలంతా చిన్నవాళ్లే. వృద్ధాప్యంలో ఉన్న సునీల్ తల్లిదండ్రులు, పేదరికంలో మగ్గిపోతున్న పూనమ్‌కు ఏం చేయాలో తెలియని పరిస్థితి. సునీల్ శవాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకని ప్రయత్నించగా.. వాహనం ఖర్చులే 25,000 వరకు అవుతాయని తెలిసింది. దీంతో దిక్కు తోచని పరిస్థితుల్లో సునీల్ శవాన్ని ఇంటికి తీసుకురావడం కష్టమేనని తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు.. సంప్రదాయం ప్రకారం కర్మకాండలు చేయడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగానే ఊర్లోనే ఓ డమ్మి చితిని ఏర్పాటు చేసి ఏడాది వయసున్న సునీల్ కొడుకు చేత చితికి నిప్పంటించారు.
సునీల్ కుటుంబం కష్టాన్ని చూసి చలించిపోయిన గ్రామస్తులు కొంత మంది ముందుకు వచ్చి సునీల్ భార్య పూనమ్‌ను చౌరిచౌర సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆఫీస్‌కి వెంటపెట్టుకు వెళ్లారు. ఢిల్లీలో సునీల్ శవానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం శవాన్ని గ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు ఈ ఘటన గురించి ఏమీ తెలియని ఎస్‌డిఎం అర్పిత్ గుప్త.. పూనమ్ దీనగాధ తెలుసుకుని చలించిపోయారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పూనమ్ కుటుంబానికి ఆర్థికంగా చేయుతనందించారు.
తన సిబ్బందితో కలిసి రూ.75,000 మేర సేకరించి పూనం బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు వెల్లడించిన ఎస్డీఎం.. పూనం ఐదుగురు పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పూనం కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులు కూడా అందించినట్టు ఎస్డీఎం అర్పిత్ గుప్త చెప్పారు.
పూనమ్ దీనగాధ గురించి తెలుసుకున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తి.. ఆమె కుటుంబానికి సహాయపడేందుకు ముందుకొచ్చారు. యూపీ సర్కార్ తరపున ఢిల్లీ పోలీసులతో మాట్లాడారు. ఫలితంగా.. సునీల్ చనిపోయిన వారం రోజుల తర్వాతైనా.. అతడి శవాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.