Madras High Court: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. స్టాలిన్‌పై హిందూమున్నా సంస్థ దాఖలు చేసిన మూడు పిటీషన్లపై మద్రాస్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్బంగా కోర్టులో జరిగిన వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.
సనాతన ధర్మం నిర్మూలించాలని, కలరా, మలేరియా, కరోనా లాంటిదంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కొన్నిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడ్డారు. కొన్ని సంఘాలైతే స్టాలిన్ తలకు రేటు కట్టాయి. స్టాలిన్ వర్సెస్ బీజేపీ వివాదం పెరిగి పెద్దదైంది. ఈ వివాదంలో భాగంగానే హిందూ మున్నా అనే సంస్థ స్టాలిన్‌పై కేసు నమోదుకు మద్రాస్ హైకోర్టులో మూడు పిటీషన్లు దాఖలు చేసింది. మద్రాస్ హైకోర్టులో ఈ పిటీషన్లపై విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు స్టాలిన్‌కు కొన్ని ప్రశ్నలు వేసింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసేముందు, దాన్ని గురించి అర్ధం చేసుకునేందుకు ఏం పరిశోధన చేశారని కోర్టు ప్రశ్నించింది. ఉదయనిధి తరపున సీనియర్ న్యాయవాది పి విల్సన్ వాదనలు విన్పించారు.
దేశంలో కుల వ్యవస్థకు కారణమైన వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్మూలించాల్సిన అవసరముందని డాక్టర్ అంబేద్కర్ చేసిన ప్రసంగాల ఆధారంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినట్టు కోర్టుకు వివరించారు. బనారస్ హిందూ యూనివర్శిటీ సైతం 1902-1937 మధ్య కాలంలో ఇదే అంశంపై అంబేత్కర్ చేసిన ప్రసంగాలను ప్రచురించిందని గుర్తు చేశారు. మనుస్మృతిలో ఉన్న కుల వ్యవస్థను రూపుమాపాలని చెప్పారే కానీ హిందూమతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, అసలు మతాన్ని కించపర్చే అంశమే లేదని తెలిపారు. దేశంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిందని, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా తప్పించుకోలేకపోయినట్టు చెప్పారు. దళితులనే కారణంతో ఆలయం గర్భగుడిలో రాకుండా అడ్డుకున్న సంగతిని మద్రాస్ హైకోర్టుకు ఉదహరించారు.
అయితే సనాతనం, హిందూయిజం వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని హిందూ మున్నా సంస్థ వాదించింది. సెప్టెంబర్ నెలలో స్టాలిన్ చేసిన ప్రసంగం కాపీని సమర్పించాలని మద్రాస్ కోర్టు ఆదేశించింది.
Also read: Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈసారి ఆ నాలుగు బిల్లులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook