"మీటూ ఉద్యమం"లో భాగంగా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను స్వీకరించి.. వాటిని విచారించడానికి ఒక ప్రత్యేక ప్యానెల్ రాబోతుంది. రిటైర్డు న్యాయమూర్తులు ఈ ప్యానెల్లో ఉండి.. సమస్యలను పరిష్కరించే దిశగా రంగం సిద్ధమవుతోంది. గతంలో, ఇదే అంశంపై మేనకా గాంధీ మాట్లాడుతూ.. లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు. అలాంటి వేధింపులకు పాల్పడేది మంత్రులైనా.. వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
కొంతమంది మహిళలు ఇలాంటి విషయాలు బహిర్గతం చేయడానికి ఒప్పుకోరని.. కానీ వారు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడితే.. ప్రభుత్వం తప్పకుండా వారి సమస్యను పరిష్కరిస్తుందని మేనకా గాంధీ తెలిపారు. ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులనేవి మంత్రిత్వ శాఖలతో పాటు మీడియా సంస్థల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా పెరుగుతున్నాయని ఆమె తెలిపారు. ఇటీవలే ఆమె #MeToo క్యాంపెయిన్‌కు మద్దతు ఇచ్చారు. ఇప్పటికైనా మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడడం ఆశాజనకమైన పరిణామమని అభిప్రాయపడ్డారు.
"ఈ #MeToo క్యాంపెయిన్ ప్రారంభించడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. అయితే ఈ క్యాంపెయిన్‌ను కావాలనే పలువురిని టార్గెట్ చేసే విధంగా మార్చకూడదు. అది క్యాంపెయిన్‌కు సంబంధించిన ఉద్దేశాన్ని నీరుగారుస్తుంది. మహిళలు కూడా ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించాలి" అని మేనకా గాంధీ తెలిపారు.