ప్రముఖ హిందుత్వ ప్రచారకురాలు సాధ్వీ ప్రాచి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గోరఖ్ నాథ్ ఆలయానికి పూజలు చేయడానికి వచ్చిన ఆమె మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివాహం జరగాలని కోరుకున్నానని తెలిపారు. "రాబోయే ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్‌కి పూర్తి మెజారిటీ రాకపోతే.. కనీసం రాహుల్ జీవితంలోకి ఓ అమ్మాయైనా రావాలని నేను కోరుకుంటున్నాను" అని ప్రాచి సెటైర్లు వేశారు. అయితే సాధ్వీ ప్రాచి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ గెహ్లాట్ స్పందించారు.
"ఈ మధ్యకాలంలో అనవసరమైన విషయాల్లోకి కాంగ్రెస్ నాయకత్వాన్ని లాగడం ప్రతీ ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. అయితే సాధ్వీ లాంటి ఆమె నోటి నుండి ఇలాంటి మాటలు రావడం అనేది ఆమె కుసంస్కారాన్ని సూచిస్తున్నాయి" అని గెహ్లాట్ తెలిపారు. విశ్వ హిందు పరిషత్ మహిళా విభాగమైన "దుర్గా వాహిని" వ్యవస్థాపకురాలైన సాధ్వీ ప్రాచి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు.
సంఘ్ పరివార్‌లో సభ్యురాలిగా చేరి ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొన్న ఆమె ఆ తర్వాత ఆ సంస్థలో కీలక సభ్యురాలిగా మారారు. ముస్లిం ప్రబోధకుడు జాకీర్ నాయక్ తలను తీసుకొచ్చి తనకు అప్పగించిన వారికి రూ.50 లక్షలు బహుమతిగా ఇస్తానని గతంలో సాధ్వీ ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచారు. ఇటీవలే ఈమె మరో వ్యాఖ్య కూడా చేశారు. ట్రిపుల్ తలాక్ లాంటి సమస్యల నుండి తప్పుకోవాలంటే.. ముస్లిం అమ్మాయిలు, హిందూ అబ్బాయిలను మాత్రమే వివాహం చేసుకోవాలని ప్రాచి తెలిపారు.