మోగిన ఎన్నికల నగారా: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఈసీ

మోగిన ఎన్నికల నగారా

Last Updated : Oct 7, 2018, 10:06 AM IST
మోగిన ఎన్నికల నగారా: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఈసీ

ఈ ఏడాది డిసెంబర్ 7న తెలంగాణ శాసన సభకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణ రాష్ర్టాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఐదు రాష్ర్టాలకు డిసెంబర్ 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ వెల్లడించారు. ఇవాళ్టి నుంచే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ర్టాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని.. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని తెలిపారు.

అటు తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. రాజస్థాన్‌లోని  (200 అసెంబ్లీ స్థానాలు) ఇదే తేదీన ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.  

అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొందని, తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా అంశంపై కేసు హై కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. తెలంగాణలో ఈ నెల 8న ఓటర్ల జాబితా అందాల్సి ఉందని, 12న ఓటర్ల జాబితాను ప్రకటించాలని తాము నిర్ణయించినట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్ వెల్లడించారు.

వేర్వేరు తేదీల్లో జరిగే తెలంగాణ & రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలకు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11న ఉంటాయన్నారు.  మిజోరాంలో అభ్యర్థుల ప్రచార ఖర్చు రూ.20లక్షలు, మిగతా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చు రూ.28లక్షలు మించకూడదని నిబంధన విధించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సిద్ధం చేసినట్టు చెప్పిన ఆయన.. ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామన్నారు. కర్ణాటకలోని షిమోగా, బళ్ళారి,మాండ్యాలకు నవంబర్ 3న ఉపఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ (ఒకే విడత)

  • ఎన్నికల నోటిఫికేషన్: నవంబర్ 12
  • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 20
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 22
  • ఎన్నికలు జరిగే తేదీ: డిసెంబర్ 7
  • ఫలితాలు వెల్లడి:  డిసెంబర్ 11

 

ఛత్తీస్ గఢ్ ఎన్నికల షెడ్యూల్ (రెండు విడతల్లో)

18 అసెంబ్లీ నియోజకవర్గాలు

  • నోటిఫికేషన్ : అక్టోబర్ 16
  • నామినేషన్లు దాఖలు చివరి తేదీ: 23 అక్టోబర్
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24
  • ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 26
  • పోలింగ్: నవంబర్ 12

72 అసెంబ్లీ నియోజకవర్గాలు

  • నోటిఫికేషన్ : అక్టోబర్ 26
  • నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 2
  • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 3
  • ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 5
  • పోలింగ్: నవంబర్ 20
  • ఫలితాలు వెల్లడి:  డిసెంబర్ 11

మధ్య ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ (ఒకే విడత)

  • నోటిఫికేషన్ : నవంబర్ 2
  • నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 9
  • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 12
  • ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 14
  • పోలింగ్: నవంబర్ 28
  • ఫలితాలు వెల్లడి:  డిసెంబర్ 11

Trending News