న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేయడంతో రాజకీయ నాయకులు మీడియా సిబ్బందిని ఆహ్వానించకుండానే ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేయడానికి, వాణిజ్య సంస్థలు తమ సిబ్బందితో వెబినార్స్ (Webinars), ఆన్‌లైన్ మీటింగ్స్ (Online meetings) నిర్వహించుకోవడం, విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడం (Online classes), అధికారులు మిగతా సిబ్బందితో సమావేశం అవడం తదితర పనులకు జూమ్ యాప్‌ను (Zoom App) విరివిగా వినియోగిస్తున్నారు. అయితే, తాజాగా ఈ మొబైల్ యాప్ వినియోగంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జూమ్ మొబైల్ యాప్ (Zoom mobile app) అంత సురక్షితం కాదని కేంద్రం స్పష్టంచేసింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు జూమ్ యాప్‌ను వినియోగించరాదని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్రం ఓ అడ్వైజరినీ కూడా విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వానికి నోడల్ సైబర్ సెక్యురిటీ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న సీఈఆర్టీ-ఇండియా (CERT-India) జూమ్ యాప్ వినియోగం సురక్షితం కాదని చెబుతూ.. గతంలో ఇదే ఏడాది ఫిబ్రవరి 6న, మార్చి 30న విడుదల చేసిన హెచ్చరికలను గుర్తుచేసింది. గతంలోనే జూమ్ యాప్ యూజర్స్‌ని ఉద్దేశించి సీఈఆర్టీ-ఇండియా పలు సూచనలు చేసింది. జూమ్ యాప్ నుంచి గతంలోనే పాస్‌వర్డ్స్ లీక్ అవడం, వీడియో కాన్ఫరెన్స్‌ల మధ్యలోంచి డేటా హైజాక్ అయిన ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ నోడల్ సైబర్ సెక్యురిటీ ఏజెన్సీ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.
అయితే, ప్రైవేటు యూజర్స్ జూమ్ యాప్‌ని వాడుకోవాల్సి వస్తే... హ్యాకర్స్‌కి చిక్కకుండా అందులోని సెట్టింగ్స్‌ని సరిచేసుకుని వినియోగించుకోవాల్సిందిగా సూచిస్తూ నోడల్ ఏజెన్సీ పలు మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. ఇదే నెల ఆరంభంలో గూగుల్ సైతం జూమ్ డెస్క్‌టాప్ అప్లికేషన్‌ని వినియోగించకూడదంటూ తమ సిబ్బందిని హెచ్చరించడాన్ని కూడా ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు.