అమెరికాలో తెలుగు వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎన్నారై మానసిక వైద్య నిపుణుడు నాగిరెడ్డి అచ్యుత్రెడ్డిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. కాన్సాస్ లోని ఎడ్జ్మూర్లో క్లినిక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన మృతదేహాన్ని పార్కింగ్ వెనక భాగంలో పోలీసులు గుర్తించారు. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. అచ్యుత్రెడ్డి వద్ద చికిత్స పొందుతున్న ఉమర్ రషీద్ అనే రోగి ఈ హత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ దుండగుడు అచ్యుతా రెడ్డితో కాసేపు మాట్లాడి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడని పోలీసులు గుర్తించారు. అచ్యుత రెడ్డి మృతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో నల్లగొండలోని ఆయన కుటుంబానికి ఏదైనా సాయం కావాలంటే తమను సంప్రదించాలని ట్వీట్ చేశారు.