కోట్లాది రూపాయిల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కోసం భారత్ చర్యలను తీవ్రతరం చేసింది. ఏప్రిల్ 26వ తేదీన సీబీఐ బృందం లండన్‌కు వెళుతున్నది. వెస్ట్ మినిస్టర్ కోర్టులో విజయ్ మాల్యాపై కేసులో తీర్పు చెప్పనున్నది. దీనికి సీబీఐ బృందం హాజరవుతుంది.
మరోవైపు, బ్యాంకు ఋణం ఎగవేత కేసులో ఈడీ కోట్ల రూపాయల ఆస్తులను మంగళవారం అటాచ్ చేసింది. కోట్లాది రూపాయిల రుణాన్ని తీసుకుని ఎగవేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.1122 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డిపిఐఎల్) సంస్థ 11 బ్యాంకులను మోసగించి 2654 కోట్ల రూపాయిల రుణాలను పొందింది. ఇవాళ ఈ కేసుకు సంబంధించి డిపిఐఎల్, దాని అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆ కంపెనీపై మనీల్యాండరింగ్ కేసును రిజిస్టర్ చేశారు. దాని ప్రకారమే ఈ ఆస్తులను అటాచ్ చేశారు. ఈ కంపెనీ కేబుల్స్‌తో పాటు ఇతర విద్యుత్తు పరికరాలను ఉత్పత్తి చేస్తుంది.