నల్లజింకలను ఎందుకు చంపకూడదు.. సల్మాన్‌కు కఠిన శిక్ష ఎందుకు విధించారు?
నల్లజింకలను వేటాడి చంపిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని గురువారం కోర్టు దోషిగా నిర్ధారించడం జరిగింది. మూడు ప్రత్యేక సెక్షన్ల క్రింద ఆయనపై గతంలో ఆ కేసులు నమోదయ్యాయి. ఇవే కేసులకు సంబంధించి ఈ రోజు సల్మాన్‌కి 5 సంవత్సరాలు శిక్ష పడింది. ఒక జంతువును చంపితే ఎందుకు అంత తీవ్రమైన శిక్ష విధించారని మీరు అనుకోవచ్చు. కానీ అన్ని జంతువులు వేరు.. ఈ నల్లజింకలు వేరు అనే సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అవి ఎందుకు అంత ప్రత్యేకమైనవో మనం కూడా తెలుసుకుందామా
భారతదేశంలో ప్రస్తుతం అంతరించిపోతున్న జంతువుల్లో ఈ నల్లజింకలు కూడా ఉన్నాయి. ఇండియన్ ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ 1972 ప్రకారం వీటిని చంపితే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం కూడా ఈ నల్లజింకలను రక్షించడానికి కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ప్రపంచ దేశాలకు తెలిపింది.
ఒకప్పుడు ఈ నల్లజింకలు భారత్‌తో పాటు పాకిస్తాన్, నేపాల్‌లో ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా, భారతదేశంలో వీటి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. కనుక, వాటిని అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చారు
20వ శతాబ్దం ప్రారంభదశలో నల్లజింకలు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఆ తర్వాత వీటి సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా అడవులను విపరీతంగా నరికేయడం వల్ల వీటికి నివాసముండడానికి చోటు కరువైంది. కనుక ఇవి జనవాసాల్లోకి వచ్చి వేటగాళ్ళకు దొరికిపోయేవి. అలా ఈ జాతి అంతరించే స్థాయికి చేరింది
2003లో తొలిసారిగా భారతదేశంలో అటవీ ప్రాణుల సంరక్షణ చట్టం సవరించబడింది. ఈ చట్టం ప్రకారం శిక్షలను మరింత కఠినతరం చేశారు. అంతరించిపోయే జంతువులను చంపే వారికి కఠిన శిక్షలు విధించాలని తెలిపారు
అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (IUCN) వారి రెడ్ డేటా జాబితా ప్రకారం నల్లజింకలు దాదాపు అంతరించిపోయే దిశగా ప్రయాణిస్తున్నాయి. వీటి జాతిని పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని ఆ సంఘం తెలిపింది
అక్టోబరు 1, 1998 తేదిన జోధ్‌పూర్ పోలీస్ స్టేషను పరిధిలోకి వచ్చే కంకనీ గ్రామంలో నల్లజింకలను వేటాడారని సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రేతో పాటు జోధ్ పూర్ నివాసి దుష్యంత్ సింగ్ పై కూడా కేసులు నమోదయ్యాయి
ఈ కేసులో లభించిన ఆధారాల ప్రకారం.. సల్మాన్ జిప్సీ నడుపుకుంటూ గ్రామంలోకి రావడంతో పాటు.. ఆ తర్వాత తన తోటి నటీనటులతో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే బుల్లెట్ల శబ్దం విని వచ్చిన గ్రామస్తులకు.. జిప్సీలో తిరిగి వెళ్లిపోతున్న సల్మాన్ కనిపించాడు. ఆ తర్వాత వారికి చనిపోయిన రెండు జింకలు కనిపించాయి
జోధ్‌పూర్‌లో సల్మాన్ ఖాన్ పై రెండు కేసులు నమోదయ్యాయి. అందులో రెండు కేసులను జింకలను వేటాడినందుకు నమోదు చేయగా.. మరో రెండు కేసులను చట్టవిరుద్ధమైన ఆయుధాలను ఉపయోగించినందుకు నమోదు చేశారు
తాజాగా జింకలను హతమార్చారన్న అభియోగంపై సల్మాన్ మీద నమోదైన కేసులో విచారణ జరిగింది. అరుదైన జాతి జింకలను హతమార్చినందుకు సల్మాన్‌ని దోషిగా పేర్కొ్ంటూ.. 5 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానాని న్యాయస్థానం విధించింది.