NPS UPS Latest Updates: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ స్కీమ్‌తో ఎలాంటి ప్రయోజనాలు లేవని.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS) డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎన్‌పీఎస్‌లోనే కొనసాగాలా..? లేదా యూపీఎస్‌లో చేరాలా..? అనే విషయంపై ఆలోచిస్తున్నారు. ఉద్యోగులకు ఏ పెన్షన్ బెటర్‌గా ఉంటుంది..? ఎందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడ తెలుసుకోండి.
యూపీఎస్‌లో చేరిన ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది. ఎన్‌పీఎస్‌లో మార్కెట్-లింక్డ్ సెక్యూరిటీ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టినందున హెచ్చుతగ్గులు ఉంటాయి. అధిక రాబడి ఉంటే అధిక పెన్షన్ వస్తుంది. మార్కెట్ పతనమైతే పెన్షన్ కూడా తగ్గుతుంది.
దీంతో ఎన్‌పీఎస్‌ను తమకు వద్దని పాత పెన్షన్ విధానమే మళ్లీ పునరుద్దరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ను ప్రకటించింది.
ఈ స్కీమ్‌ను ఏప్రిల్ 1, 2025 నుంచి అమలు చేయనుంది. యూపీఎస్‌కు, గత పెన్షన్ పథకాలకు మధ్య తేడా ఏంటో ఓసారి పరిశీలిద్దాం..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కంటే కొత్తగా తీసుకువచ్చిన యూపీఎస్‌లో మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్‌పీఎస్‌లో స్థిరమైన పెన్షన్ ఉండకపోవడం పెద్ద మైనస్ కాగా యూపీఎస్‌లో గ్యారంటీ పెన్షన్ లభిస్తుంది.
యూపీఎస్‌లో చేరిన ఓ ఉద్యోగి కనీసం 25 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసిన తర్వాత.. చివరి 12 నెలల సర్వీస్‌లో పొందిన సగటు మూలవేతనంలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్‌గా అందుకుంటాడు.
యూపీఎస్‌లో కనీస నెలవారీ పెన్షన్ రూ.10 వేలతోపాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉంటుంది. ఈ సౌకర్యాలు ఎన్‌పీఎస్‌లో లేవు. ఓపీఎస్‌లో మాదిరే యూపీఎస్‌లో ఫ్యామిలీ పెన్షన్‌ను యాడ్ చేశారు. పదవీ విరమణ పొందిన వ్యక్తి చివరిగా అందుకున్న పెన్షన్‌లో 60 శాతం కుటుంబ పెన్షన్‌గా చెల్లిస్తారు.
యూపీఎస్‌లో సూపర్‌యాన్యుయేషన్‌లో మొత్తం, గ్రాట్యుటీ ఫీచర్‌లు కూడా ఉంటాయి. ఇది ప్రతి ఆరు నెలల ప్రభుత్వ సర్వీస్‌కు నెలవారీ వేతనం, అలవెన్సులలో 1/10 వంతుగా లెక్కిస్తారు. అయితే ఎన్‌పీఎస్ మాదిరే యూపీఎస్‌లోనూ ఉద్యోగుల నుంచి పెన్షన్ సహకారం చెల్లించాలి. అంటే ఉద్యోగుల జీతం నుంచి పెన్షన్ ఫండ్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
యూపీఎస్ కింద ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసుకుంటే.. స్థిర పెన్షన్‌కు అర్హులు అవుతారు. 25 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన తర్వాత సగటు బేసిక్ పేలో 50 శాతం పెన్షన్‌గా తీసుకోవచ్చు.
2004 నుంచి ఎన్‌పీఎస్ కింద రిటైర్ అయిన ఉద్యోగులు యూపీఎస్‌కు అర్హులు. అదేవిధంగా ఎన్‌పీఎస్ కింద వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్)ని తీసుకున్న వారు కూడా అర్హులే.
మార్కెట్-లింక్డ్ సెక్యూరిటీ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టినందున ఎన్‌పీఎస్ కింద పెన్షన్ అమౌంట్‌లో తేడాలు ఉంటాయి. మార్కెట్‌లో రాబడుల ఆధారంగా ఉద్యోగులకు పెన్షన్ అందుతుంది.
రిస్క్ లేకుండా గ్యారెంటీ పెన్షన్ కావాలనుకునే ఉద్యోగులు యూపీఎస్‌లో చేరొచ్చు. రిస్క్ అయిన పర్వాలేదనుకునే వారికి ఎన్‌పీఎస్ సరిపోతుంది. ఉద్యోగులు కచ్చితంగా యూపీఎస్‌లో చేరాలనే నిబంధన లేదు. ఎన్‌పీఎస్‌లో కొనసాగాలనుకునే ఉద్యోగులు కంటిన్యూ అవ్వొచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే రాసినది. NPS లేదా UPS తాజా, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.