UPS Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ప్రస్తుతం జోరు చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారొచ్చని కేంద్రం సూచించింది. ఈ స్కీమ్ ద్వారా గ్యారంటీ పెన్షన్‌ను అందుకుంటారు. ఏప్రిల్ 2004 తర్వాత సర్వీసులో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ యూపీఎస్‌లో చేరే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఎస్‌ను అమలు చేయనుంది.
ఎన్‌పీఎస్ విధానం చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో యూపీఎస్‌ను ప్రవేశపెట్టింది. ఈ నెల 24న కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
యూపీఎస్‌లో చేరితే లాభం ఉంటుందా అని చాలామంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఎన్‌పీఎస్ పెన్షన్ సహకారం 14 శాతం ఉండగా.. యూపీఎస్‌లో 18.5 శాతానికి పెరుగుతుందని UTI పెన్షన్ ఫండ్ అధ్యయనంలో తేలింది.
యూటీఐ గణన ప్రకారం.. నెలవారీ జీతం రూ.50వేలపై చేరిన వారికి దాదాపు 19 శాతం పెరుగుదల ఉంటుంది. ఉద్యోగుల వార్షిక వేతనం 3 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. అంటే ఇది 8 శాతం CAGR లేదా కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతుందని తెలిపింది.
యూపీఎస్‌లో ఓ ఉద్యోగి తన రిటైర్‌మెంట్‌కు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పే సగటులో 50 శాతం కచ్చితంగా పెన్షన్‌గా అందుకుంటారు.
ఒకవేళ ఉద్యోగి మరణిస్తే.. వారి భాగస్వాములకు పింఛన్ చెల్లిస్తారు. ఆ ఉద్యోగి చనిపోయే నాటికి అందుకుంటున్న జీతంలో 60 శాతాన్న పెన్షన్‌గా అందిస్తారు.
యూపీఎస్‌లో చేరాలనే కచ్చితమైన నిబంధనను కేంద్రం పెట్టలేదు. ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఎస్‌లో అయినా కొనసాగవచ్చు లేదా యూపీఎస్‌లో చేరాలనుకుంటే చేరొచ్చని కేంద్రం తెలిపింది.
యూపీఎస్ కింద కనీసం పదేళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులు.. కనిష్టంగా కనీసం రూ.పది వేల పెన్షన్ పొందుతారు.
ఎన్‌పీఎస్‌ను కేంద్రం జనవరి 1, 2004న ఓపీఎస్ స్థానంలో తీసుకువచ్చింది. అప్పటి నుంచి సర్వీస్‌లో చేరిన ఉద్యోగులు అందరూ ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చారు.
అయితే ఎన్‌పీఎస్‌ను కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఓపీఎస్‌నే అమలు చేశాయి.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. యూపీఎస్ గురించి పూర్తి తాజా, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.