Zomato Order Viral Video: మీరు ఇంట్లోంచి బయటికి వెళ్లి చేతిలో ఏ వాహనం లేకుండా ఎక్కడైనా చిక్కుకుపోతే తిరిగి ఇంటికి రావడానికి ఏం చేస్తారు ? వీలైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సహాయంతో ఇంటికి చేరుకుంటారు. లేదంటే ఓలా, ఉబర్ లాంటి మొబైల్ యాప్స్ సహాయంతో వాహనం బుక్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఎవరినైనా లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తారు కదా.. పూణెకు చెందిన సార్థక్ సచ్‌దేవ అనే యువకుడికి కూడా అచ్చం ఇలాంటి సమస్యే ఎదురైంది. అతడు కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం ట్రై చేశాడు. ఓలా, ఉబర్ కూడా ట్రై చేశాడు. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమోనని కూడా ప్రయత్నించాడు. ఇవేవీ కుదరలేదు. ఏ వాహనం అందుబాటులో లేదు.. లిఫ్ట్ ఇచ్చే వాళ్లు కూడా ఎవ్వరూ లేరు. దీంతో ఇప్పుడు ఇంటికి ఎలా చేరుకోవాలా అని ఆలోచిస్తున్న సార్థక్ సచ్‌దేవకి బుర్రలో ఓ ఐడియా మెరిసింది.
ఎవరైనా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరి యాప్స్‌ని ఫుడ్ డెలివరి కోసమే ఉపయోగించుకుంటారు. కానీ సార్థక్ సచ్‌దేవ మాత్రం వెరైటీగా ఆలోచించాడు. ఎంత వెరైటీగా అంటే.. సార్థక్‌కి వచ్చిన ఆలోచనకు నెటిజెన్స్ సైతం ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో సార్థక్ పోస్ట్ చేసిన వీడియో చూసి నెటిజెన్స్ భారీ సంఖ్యలో స్పందిస్తున్నారు.
ఇంతకీ సార్థక్ ఏం చేశాడంటే..
తనకు సమీపంలో ఉన్న మెక్ డొనాల్డ్ స్టోర్ నుండి జొమాటో ద్వారా తన ఇంటికి డెలివరి అయ్యేలా బర్గర్ ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ అందుకున్న జొమాటో డెలివరి బాయ్ అక్కడికి వచ్చి లోగా సార్థక్ సచ్‌దేవ మెక్ డొనాల్డ్ వద్దకు చేరుకున్నాడు. జొమాటో డెలివరి బాయ్ మెక్ డొనాల్డ్ స్టోర్ నుండి బర్గర్ ఆర్డర్ తీసుకుని బయటికి వచ్చేటప్పటికి అతడి వద్దకు వెళ్లాడు. తన పరిస్థితి ఏంటో అతడికి అర్థం అయ్యేలా చెప్పి బర్గర్ ఆర్డర్ డెలివరి చేయడంతో పాటే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. తనకు ఇంటికి వెళ్లేందుకు సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు.
సార్థక్ సచ్‌దేవ పరిస్థితి అర్థం చేసుకున్న సదరు జొమాటో డెలివరి బాయ్.. వెంటనే అతడిని ఓకే చెప్పాడు. సార్థక్ ఇంటికి బర్గర్ ఆర్డర్‌తో వెళ్తూ అతడిని కూడా వెంటపెట్టుకుని వెళ్లి అక్కడే దింపాడు. ఆర్డర్ చేసిన బర్గర్‌ని చెరో సగం చేసుకుని పంచుకుని తింటూ తమ ఆనందాన్ని కూడా చెరో సగం పంచుకున్నారు. సార్థక్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సార్థక్ ఐడియా బాగానే ఉంది కానీ ఇలాంటి ఐడియాలు అందరి విషయంలో అన్నిసార్లు కుదురవు. ఎందుకంటే సార్థక్ విషయంలో జొమాటో డెలివరి బాయ్ అంగీకరించాడు కనుక అతడి విషయంలో సరిపోయింది. అందరి విషయంలో ఇలానే జరుగుతుంది అని గ్యారెంటీ ఏం లేదు. ఏదేమైనా సార్థక్ ఐడియాకు నెటిజెన్స్ నుండి భారీ రెస్పాన్స్ మాత్రం కనిపిస్తోంది.