మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో భాగంగా శనివారం సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి టీ20 సిరీస్‌ని సైతం కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేయగలిగింది. అనంతరం 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో విజయం టీమిండియా సొంతమైంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో సౌతాఫ్రికా సేన గెలవడానికి కేవలం 19 పరుగులే అవసరమై వుండటంతో మ్యాచ్ ఫలితం కాస్తా మరింత ఉత్కంఠగా మారింది. ఒకానొక దశలో టీ20 సిరీస్ చేయిజారిపోతుందా అన్నంత ఆందోళనకు గురయ్యారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్.
చివరి ఓవర్లో బంతి విసిరిన భువనేశ్వర్ మొదటి నాలుగు బంతుల్లో వైడ్, ఫోర్ల రూపంలో 7 పరుగులు సమర్పించుకోవడంతో మిగిలిన మరో రెండు బంతుల్లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కనిపించింది. కానీ భువనేశ్వర్ విసిరిన 5వ బంతికి రెండు పరుగులే చేసిన జోంకర్ ఆరో బంతికి ఏకంగా భారీ షాట్‌కి ప్రయత్నించబోయి రోహిత్ చేతికి క్యాచ్ ఇవ్వడంతో సఫారీల పోరాటానికి తెరపడింది. అంతిమంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలుపొంది టీ20 సిరీస్‌ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
మొత్తానికి ఎన్నో ఆశలతో సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా జట్టు... సౌతాఫ్రికా గడ్డపై జరిగిన మొదటి టెస్ట్ సిరీస్ కోల్పోయినా.. ఆ తర్వాత జరిగిన వన్డే, టెస్ట్ సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది.