జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నే మోర్కెల్.. వచ్చే నెల స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ ముగిసిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. బిజీ షెడ్యూల వల్ల కుటుంబ జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని.. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. 'రిటైర్మెంట్ నిర్ణయం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. కానీ, నూతన జీవితం మొదలుపెట్టేందుకు ఇదే సరైన సమయం' అన్నారు. నాలో క్రికెట్ జీవితం చాలా ఉందని చెప్పారాయన.
2006లో డర్బన్‌లో భారత్‌తో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన మోర్కెల్(33) సఫారీ జట్టు తరఫున 83 టెస్టులు ఆడి 294 వికెట్లు పడగొట్టాడు. 2008 నుంచి రెగ్యులర్‌గా జట్టులో చోటు సంపాదించిన ఈ పేసర్.. 117 వన్డేల్లో 188, 47 టీ20ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇన్ని సంవత్సరాలు తనకు మద్దతుగా నిలిచిన బోర్డు, జట్టు సహచరులు, కుటుంబసభ్యులు, అభిమానులకి కృతజ్ఞతలు చెప్పాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మోర్కెల్‌ను ఈసారి వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. డర్బన్‌లో మార్చి 1న సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు జరగనుంది.