న్యూఢిల్లీ: ఒక జట్టులో 11 మంది విరాట్ కోహ్లీలు ఉండాలంటే అదెలా సాధ్యమవుతుందని శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం మొహాలీలో జరిగిన 4వ వన్డేలో భారత్ ఓటమి చెందిన నేపథ్యంలో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆసిస్ జట్టుకు భారీ విజయ లక్ష్యాన్ని విధించిన అనంతరం సైతం భారత్ ఓటమిపాలవడాన్ని భారతీయ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకానొక దశలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై సైతం ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు. ఇదే విషయమై ముత్తయ్య మురళీధరన్ వద్ద మీడియా ప్రస్తావించగా ఆయన భారత జట్టుపై విమర్శలు అర్థరహితం అని కొట్టిపారేశారు.
ప్రతీ జట్టులో 11 మంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభ కనబర్చాలంటే అది సాధ్యపడదు. ఒక జట్టులో 11 మంది విరాట్ కోహ్లీలో లేక సచిన్ టెండుల్కర్లో లేక డాన్ బ్రాడ్‌మన్స్ ఉండాలంటే కుదరదు అని ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డారు. ప్రయోగాలు చేస్తున్న దశలో కొన్ని ఓటములు సహజం. అంతమాత్రానికే ఓడిపోయారని విమర్శించడం తగదు. భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. అలాంటి దశలో ఒత్తిళ్లకు గురిచేయొద్దు. ఒత్తిళ్ల మధ్య ఆట ఆడటం కుదరదు అని మురళధరన్ తేల్చిచెప్పారు.