భారతదేశంలో ధనిక క్రీడాకారులు వీరే..!!

భారతదేశం క్రీడలను ప్రేమించే భూమి. ఇక్కడ క్రీడలను ప్రేమించే అభిమానులు ఉన్నారు.

Last Updated : Jan 30, 2018, 03:18 PM IST
భారతదేశంలో ధనిక క్రీడాకారులు వీరే..!!

భారతదేశం క్రీడలను ప్రేమించే భూమి. ఇక్కడ క్రీడలను ప్రేమించే అభిమానులు ఉన్నారు. క్రీడాకారులను దేవుళ్లుగా ఆరాధించే అభిమానులూ ఉన్నారు.  హాకీ, టెన్నిస్, బాడ్మింటన్, స్నూకర్ మరియు చెస్ వంటి క్రీడలకు అభిమానులు ఉన్నా.. ఎక్కువ ప్రజాదరణ కలిగిన క్రీడ క్రికెట్. నేడు సినీ స్టార్‌లతో సమానమైన స్థాయిలో క్రీడాకారులు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి ఈ రోజు ఈ వ్యాసం మీకోసం ప్రత్యేకం. 

భారతదేశంలో అత్యంత ధనవంతులైన క్రీడాకారులు కొంతమంది ఉన్నారు. వీరి ఆస్తుల గురించి వింటే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే..! ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేటప్పుడు వచ్చే భారీ నజరానాలతో పాటు, వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రకటనలు.. ఇలా వివిధ మార్గాల ద్వారా వీరికి ఆదాయం సమకూరుతోంది. అలానే వీరి ఆస్తులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్రీడల్లో క్రేజ్ ఉన్న క్రికెట్ క్రీడాకారులే ఆదాయం, పారితోషికాల విషయాల్లో టాప్‌లో ఉన్నారు.

11. సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, హైదరాబాద్ వాసి. పుల్లెల గోపీచంద్ సైనాకు కోచ్. సైనా తన కెరీర్లో ఎన్నో అంతర్జాతీయ టైటిల్స్ గెల్చుకున్నారు. ప్రస్తుతం సైనా ఆస్తుల విలువ $15 మిలియన్లు. 

 

10. గౌతమ్ గంభీర్

ప్రతిభావంతులైన బాట్స్‌మెన్‌లలో గౌతమ్ గంభీర్ ఒకరు. ఆయన ఆస్తుల విలువ 20 మిలియన్ డాలర్లు. ఇతను కొహ్లీ, సెహ్వాగ్ వలే ఢిల్లీ ఆటగాడు. దేశంలో నే అత్యధిక పరుగులను స్కోర్ చేశాడు.

9. రాహుల్ ద్రావిడ్ 

రాహుల్ ద్రావిడ్ టీమిండియా పూర్వపు కెప్టెన్. ఈయన ఆస్తుల విలువ $22.6 మిలియన్లు. ప్రస్తుతం అండర్ 19 భారత జట్టుకి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తూ యువ జట్టుకి  మార్గనిర్దేశం చేస్తున్నారు ద్రావిడ్. 

 

8. సానియా మిర్జా
  
హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న ఈమె పాకిస్తాన్‌లోనే తన భర్త ఇంట్లో ఉంటున్నారు.  
అయితే పాకిస్తానీని పెళ్లి చేసుకున్నా..భారత్ తరఫునే టెన్నిస్ ఆట ఆడుతోంది సానియా.ఈమె ఆస్తుల విలువ $26 మిలియన్లు.ఈమె ఆడిడాస్, విల్సన్, ఫ్యాబ్ బి వంటి బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు. 

7.యూసఫ్ పఠాన్

ఒకప్పుడు టీమిండియాలో ఆల్‌రౌండర్‌గా వ్యవహరించిన యూసఫ్ పఠాన్.. మంచి బ్యాట్స్‌మన్, బౌలర్ కూడా. ఈయన ఆస్తుల విలువ $26.5 మిలియన్లు. పెప్సికో, టాటా ఇండికాంకు అంబాసిడర్‌గా ఉన్నారు. 

6. యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్ ఆల్‌రౌండర్. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని జయించి నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నాడు. ప్రపంచ‌కప్‌‌లో 15 వికెట్లు తీశాడు. భారతదేశంలో 6వ ధనిక క్రికెటర్‌గా యువరాజ్‌ను పేర్కొంటారు. ఈయన ఆస్తుల విలువ $35. 5 మిలియన్లు

 

5.వీరేందర్ సెహ్వాగ్  

వీరూగా పిలువబడే వీరేందర్ సెహ్వాగ్ ఆస్తుల విలువ $ 40 మిలియన్లు.  టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ రికార్డు ఘనత ఈయనకే దక్కుతుంది. ఫిలా, హీరో హోండా, జేకే సిమెంట్స్‌కు అంబాసిడర్‌గా ఉన్నారు. 
 

4.సౌరవ్ గంగూలీ 

సౌరవ్ గంగూలీ టీమిండియా మాజీ కెప్టెన్. 'ప్రిన్స్ ఆఫ్ కోల్కతా'గా పిలువబడే గంగూలీ ఆస్తుల విలువ $55.5 మిలియన్లు. గంగూలీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

3. విరాట్ కొహ్లీ

విరాట్ కొహ్లీ.. భారతదేశంలో ధనవంతుల జాబితాలో ఉన్న క్రీడాకారుల్లో మూడవ స్థానంలో ఉన్నారు. మలేషియాలో జరిగిన 2008 యు-19 క్రికెట్ ప్రపంచ కప్ లో గెలుపొందిన భారత జట్టుకి కొహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నారు. విరాట్ కొహ్లీ ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే క్రీడాకారుల్లో ఒకరు. ఈయన ఆస్తుల విలువ $60 మిలియన్లు.  భారతదేశంలో క్రీడాకారుల ధనవంతుల జాబితాలో విరాట్ మూడవ స్థానంలో ఉన్నారు. 

2. ఎంఎస్. ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుకు పూర్వపు కెప్టెన్. ఈయన భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. $ 35 మిలియన్ డాలర్ల నుండి $110 మిలియన్ డాలర్ల వరకు ఎదిగారు. ఈయన దేశంలోనే కాదు.. ప్రపంచంలో కూడా ధనవంతులైన క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ధోనీ ఆదాయంలో సింహభాగం బ్రాండ్ల ప్రకటనలదే..! 20కి పైగా బ్రాండ్ల ఒప్పందాలను కలిగి ఉన్నాడు. వాటిలో పెప్సీ, రీబాక్, జీఈ మనీ, టివీఎస్ మోటార్స్ కొన్ని. భారతదేశంలో ధనవంతులైన క్రీడాకారుల జాబితాలో ధోనీ రెండవ స్థానంలో ఉన్నారు.

 

1. సచిన్ టెండూల్కర్

'క్రికెట్ దేవుడు'గా అభిమానులు ఆరాధించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ ప్రపంచ క్రికెటర్ల జాబితాలో ఒక శిఖరం. ఇండియాతో పాటుగా, ప్రపంచంలో కూడా అత్యంత ధనిక క్రీడాకారుడు. టీమిండియాను ప్రపంచ వేదికలపై ఉన్నతస్థానానికి తీసుకెళ్ళిన క్రికెటర్లలో ఆయనొకరు. రెండు దశాబ్దాలపాటు సచిన్ క్రికెట్‌లో ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ $160 మిలియన్లు. భారతదేశంలో ధనవంతులైన క్రీడాకారుల జాబితాలో సచిన్ మొదటి స్థానంలో ఉన్నారు.  ఈ క్రీడాకారులతో పాటు దేశంలోని ధనిక క్రీడాకారుల జాబితాలో లియాండర్ పేస్, మహేష్ భూపతి, విశ్వనాథన్ ఆనంద్, మేరీ కోమ్, పంకజ్ అద్వానీ, మిల్ఖా సింగ్ కూడా ఉన్నారు.

Trending News