సిద్ధిపేట సభలో మహిళా సంఘాలకు కేసీఆర్ ఉపాధి హమీ

                        

Last Updated : Nov 20, 2018, 02:33 PM IST
సిద్ధిపేట సభలో మహిళా సంఘాలకు కేసీఆర్ ఉపాధి హమీ

ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్ధిపేటలో టీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.  24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని..టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రుణమాఫీ చేసి బ్యాంకుల్లో ఉన్న పాస్ పుస్తకాలను రైతులకు ఇప్పించామన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 8 వేలు ఇస్తూ.. ఇలా అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. గతంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉండేదని..కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎంతో మెరుగైందని కేసీఆర్ పేర్కొన్నారు

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఏడాదికల్లా ప్రాజెక్టులు పూర్తి చేసుకొని కోటి ఎకరాలకు నీరు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. పంటకు డిమాండ్ ఉండాలంటే అగ్రికల్చర్ వర్శిటీ సూచనల ప్రకారం పంటల కాలనీ తయారు చేస్తామన్నారు. కాలనీ ఆధారంగా ప్రతీ రైతు పంట వేయాల్సి ఉంటుందన్నారు. రైతు  పండించిన ధాన్యాన్ని ఎక్కడికో వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇక ఉండదన్నారు. ప్రతి మండలంలో ఫుడ్ ఫ్యాక్టరీ యూనిట్ ఏర్పాటు చేసి అందులోనే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫుడ్ ఫ్యాక్టరీ యూనిట్ నడిపే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. ఫలితంగా మహిళలకు ఉపాధి దొరుకుతుందని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో హరీశ్ రావు‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా సిద్ధిపేట ప్రజలను కోరారు.

Trending News