ఢిల్లీ: ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ ముగిసింది. మొత్తం 40 నిమిషాలపాటు జరిగిన భేటీలో ఉమ్మడి ప్రణాళిక..ఉమ్మడి ఎజెండా..సమిష్ఠి కార్యచరణపై చర్చ జరిగింది. అదే సమయంలో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై కూడా చర్చ జరిగింది. తమకు మొత్తం 17 సీట్లు కేటాయించాలని కోదండరాం ఈ సందర్భంగా రాహుల్ ను కోరారు . దీనిపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీట్ల సర్దుబాటును పీసీసీ స్థాయిలో తేల్చుకోవాలని కోదండరాకు సూచించారు. దీంతో బాల్ మళ్లీ పీసీసీ కోర్టులో వేసినట్లయింది.
రాహుల్ తో భేటీ అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ బలం ఉన్న చోట్ల తమకు సీట్లు కేటాయించాలని రాహుల్ ను కోరినట్లు తెలిపారు. తాము మొత్తం 17 సీట్లు ఇవ్వాలని కోరామని .. అయితే ఈ విషయం పీసీసీ స్థాయిలో చర్చించుకోవాలని రాహుల్ చెప్పడంతో..కూటమి ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని.. సీట్ల సర్దుబాటు త్వరగా తేల్చాలని కోరినట్లు కోదండరాం పేర్కొన్నారు.
కోదండరాం పార్టీ కూటమిలో కొనసాగేనా ?
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 95 స్థానాల్లో ...టీడీపీ 14 స్థానాల్లోనూ..మిగిలిన 10 సీట్లు టీజేఎస్, సీపీఐ పంచుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీసీఐ ఐదు సీట్లు తీసుకుంటే ఇక మిగిలియింది.. 5 సీట్లు కోదండరాం తీసుకోవాల్సి ఉంది. తమకు 15 సీట్లు కావాలని టీజేఎస్ఎ ప్పటి నుంచో పట్టుబడుతోంది. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియాలకు టీజేఎస్ తేల్చి చెప్పింది. అయితే దీనికి వారు అంగీకరించకపోవడంతో ఈ పంచాయితి రాహుల్ వద్దే తేల్చుకోవాలని కోదండరాం డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో నేరుగా ఢిల్లీకి వచ్చిన కోదండరాం రాహుల్ తో భేటీ అయ్యారు. అయితే రాహుల్ కూడా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎటూ తేల్చకుండా బాల్ ను పీసీసీ కోర్టులో వేయడంపై కోదండరాం పార్టీ మహాకూటమిలో కొనసాగే విషయంపై నీలినీడలు కమ్మకున్నాయి. ఈ నేపథ్యంలో కోదండరాం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.