Hyderabad Rain Live Updates : హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంత మేఘావృతమై పలు ప్రాంతాల్లో జోరువాన కురుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే హైదరాబాదులో ఈ రాత్రి అంటే ఆగస్టు 15, గురువారం రాత్రి రెండు గంటల పాటు భారీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షం సాయంత్రం నుంచి దంచి కొడుతోంది. నేడు నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , ఫిలింనగర్, యూసఫ్ గూడా, మధుర నగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాతావరణం రెండు రోజులుగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే జిహెచ్ఎంసి కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలను జారీ చేశారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని మ్యాన్ హోల్స్, అదేవిధంగా ఓపెన్ నాలాల వద్ద పౌరులు సంచరించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జాం కూడా విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. జిహెచ్ఎంసి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే వెంటనే రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని కూడా అలాంటి చేసి ఉంచింది. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట. మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాలలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.