ఆ వలస కూలీలకు ఎంత కష్టం. ఓ వైపు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో బతకడానికి ఉపాధి లేదు. తినడానికి తిండి లేదు. మరోవైపు సొంతూరికి వెళ్దామంటే .. అందుబాటులో వాహనాలు లేవు. దీంతో కాలినడకనే బతుకు ప్రయాణం సాగిస్తున్నారు. దారిలో దొరికిన లారీ, ట్రక్కు ఇలాంటి వాటిని ఆశ్రయిస్తే.. అవి కూడా మధ్యలోనే ప్రమాదానికి గురై.. బతుకు మరింత నరకప్రాయమవుతోంది.
నిర్మల్ జిల్లా భాగ్యనగర్‌లో వలస కూలీలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 70 మంది వలస కూలీలు ప్రయాణిస్తున్నారు. ఇందులో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 20 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. దీంతో వారందరిని స్థానికులు పలు ఆస్పత్రుల్లో చేర్పించారు. మిగతా వలస కూలీలకు ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.
అతి వేగంతో అదుపు తప్పిన లారీ.. రెయిలింగ్‌ను ఢీకొట్టిందని స్థానికులు, వలస కూలీలు చెబుతున్నారు. రెయిలింగ్‌ను ఢీకొట్టిన తర్వాత పల్టీలు కొట్టిందంటున్నారు. అదృష్టవశాత్తూ అందరం ప్రాణాలతో మిగిలామని వలస కూలీలు చెబుతున్నారు. తామంతా హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ వెళ్తున్నామని తెలిపారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని హైదరాబాద్ తరలించారు. మరో ఏడుగురు నిర్మల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు ఘటనా స్థలాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారిని గోరఖ్ పూర్‌కు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..