Mahesh Bank: సైబర్ దాడి కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు.. అదుపులో నిందితుడు

Mahesh Bank Cyber hack Case: మహేష్ బ్యాంకుపై సైబర్ హ్యాక్ కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు చిక్కాయి. వినోద్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 04:56 PM IST
  • మహేష్ బ్యాంకు సైబర్ హ్యాక్ కేసు
  • పోలీసుల చేతికి కీలక ఆధారాలు
  • వినోద్ అనే నిందితుడి అరెస్ట్
  • త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్న పోలీసులు
Mahesh Bank: సైబర్ దాడి కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు.. అదుపులో నిందితుడు

Mahesh Bank Cyber hack Case: హైదరాబాద్‌లోని (Hyderabad) మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ దాడి కేసులో పోలీసులు కీలక ఆధారాలను రాబట్టారు. సైబర్ దాడికి రెండు నెలల ముందు నుంచే నేరగాళ్లు పక్కా ప్లాన్‌ వేసినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలో మహేష్ కోఆపరేటివ్ బ్యాంకుకు చెందిన మూడు బ్రాంచ్‌లలో కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసి.. సూపర్ అడ్మిన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తదితర కీలక వివరాలను నేరస్తులు సేకరించినట్లు గుర్తించారు.

నిందితులు తెలివిగా వ్యక్తుల పేరిట కాకుండా సంస్థల పేరిట బ్యాంకులో (Mahesh Bank) ఖాతాలు తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 23న మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో నిందితులు తొలిసారిగా కరెంట్ అకౌంట్ ఖాతా తెరిచినట్లు తెలిపారు. నాగోల్ బ్రాంచ్‌లో శాన్విక ఎంటర్‌ప్రైజెస్ పేరిట ఆ ఖాతా తెరిచినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ నెల 11 పాతబస్తీలోని హుస్సేనీ ఆలం బ్రాంచ్‌లో హిందుస్తాన్‌ ట్రేడర్స్‌ పేరిట ఒక ఖాతాను, సిద్ధంబర్ బజార్‌ బ్రాంచ్‌లో మరో కంపెనీ పేరిట మరో ఖాతాను తెరిచినట్లు తెలిపారు. హుస్సేనీ ఆలంకు చెందిన ఓ వ్యాపారవేత్త సాయంతో ముంబైకి చెందిన మహిళల ద్వారా ఈ ఖాతాలు తెరిపించినట్లు గుర్తించారు.

సూపర్ అడ్మిన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను సేకరించడం ద్వారా మహేష్ బ్యాంకు (Mahesh Bank)మెయిన్ సర్వర్‌ను నిందితులు హ్యాక్ చేశారు. ఇటీవల తెరిచిన మూడు కరెంట్ అకౌంట్ ఖాతాల ద్వారా దాదాపు రూ.12.4 కోట్లను వాటిల్లోకి మళ్లించారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోని దాదాపు 128 బ్యాంకు ఖాతాలకు ఆ డబ్బును ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రాక్సీ అకౌంట్లను ద్వారా ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  సుమారు 18 గంటల పాటు హ్యాకర్లు బ్యాంకు సర్వర్లను తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు గుర్తించారు.

నిందితులు బ్యాంకు సూపర్ అడ్మిన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా సేకరించారన్న దానిపై పోలీసులు (Telangana Police) దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితుల ఐపీ అడ్రెస్‌లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వినోద్ అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read: India Corona Cases Today: దేశంలో 4 కోట్ల మార్క్ ను దాటిన కరోనా కేసులు- పెరిగిన మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News