టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నాయని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ పనితీరుకు పార్లమెంట్‌లో ప్రధాని ప్రకటనలే సాక్ష్యమన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సమక్షంలో నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో మొత్తం 12 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తమకు పదవులపై ఆశ ఉందనడం విడ్డూరమన్నారు.
ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై కూడా నిప్పులు చెరిగారు. బ్లాక్ మెయిల్ చేసుకుని బతికేవాళ్లు టీఆర్ఎస్‌ను విమర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తనను బచ్చాగాడు అనే కాంగ్రెస్ నేతలు.. తనకంటే వయస్సులో మూడేళ్లు పెద్దవాడై, ఎటువంటి ఉద్యమం చేపట్టకుండా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీని ఏమంటారని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోనే నంబర్‌వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు పేరు రావడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రజలు గెలిపిస్తేనే శాసనసభ్యుడిని అయ్యానని, 2006-2014 వరకు తెలంగాణ ఉద్యమంలో ఉండి.. జైలుకు పోయినన్నారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు చెబుతున్న రూ.2లక్షల వరకు రుణమాఫీ ప్రకటన నమ్మొద్దని.. ఆ హామీ సాధ్యం కాదన్నారు.
ఏ పేపర్లు, టీవీలు చూస్తుంటే రేపే పోలింగ్ అనే భావన కల్గుతుందన్నారు. అయినా ఏ ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్‌కు భయం లేదని, కాంగ్రెస్సోళ్లకే భయం అన్నారు. కేసీఆర్ గురించి కాంగ్రెస్ నేతలు తక్కువ అంచనా వేశారన్నారు.