Lagacharla Incident: వికారాబాద్ జిల్లా కలెక్టర్ దాడి ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని.. దీని వెనుక ఉన్న కుట్రదారులపై విచారణ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటోందని మండిపడ్డారు. మరోసారి ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ఉరుకోమని హెచ్చరించారు.
Also Read: Harish Rao: తెలంగాణకు కేసీఆర్ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్ రెడ్డి రివర్స్ చేస్తుండు
వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపై దాడి ఘటనపై హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష చేశారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులతో సమావేశమై దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ బాబు ఈ దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. 'ప్రజాభిప్రాయ సేకరణ వద్దకు రైతులను వెళ్లనివ్వకుండా పథకం ప్రచారం కొంతమంది చేశారు. ప్రజలను రెచ్చగొట్టే లా చేసి కలెక్టర్‌పైన భౌతిక దాడికి పాల్పడ్డారు' అని వివరించారు.
Also Read: Korutla MLA Padayatra: కేటీఆర్ యాత్రకు ముందే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర
ఈ సందర్భంగా దాడి ఘటనపై మంత్రి కొన్ని ప్రశ్నలు వేశారు. 'కలెక్టర్‌ను పథకం ప్రకారం రమ్మని చెప్పింది ఎవరు? దాడి చేసింది ఎవరు?' అని ప్రశ్నించారు. దాడి వెనుక ఉన్న కుట్రదారులపై కచ్చితంగా విచారణ జరుపుతామని తెలిపారు. 'లగచర్ల ఘటనపై సమగ్ర విచారణ జరుపుతాం. దీని వెనుక ఎవరున్నది విచారణ తర్వాత చెపుతాం. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుతగిలే వారిని ఉపేక్షించం' అని స్పష్టం చేశారు.
'ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయాలను తెలపడానికి వేదిక ఉంటుంది. మా ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉంది. రౌడీయిజం చేసి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే ఉపేక్షించం' అని శ్రీధర్ బాబు హెచ్చరించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఎవరు చేస్తున్నారో ఆ కుట్రలను బయటపెడతామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం చేసే వారి కుట్రలను వెలికితీస్తామని ప్రకటించారు. పోలీస్, ఇంటెలిజెన్స్, ప్రభుత్వ అధికారుల్లో ఎవరి వైఫల్యం ఉందో విచారణ జరిపిస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని చెప్పారు.
'ప్రజాభిప్రాయం ప్రకారమే ఫార్మా కంపెనీ విషయంలో ముందుకు వెళ్తాం. ఎవరికి ఎవరూ భయపడరు.. మేం రాజకీయం చేయం' అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాలు అడ్డుకోలేదని.. సలహా, సూచనలు మాత్రమే ఇచ్చామని చెప్పారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాలు చెప్పాలనుకుంటే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి